మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టీడీపీ, వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల తేదీ దగ్గరపడేకొద్దీ మాటల యుద్ధం మరింత ముదురుతోంది. అటాక్స్, కరప్షన్, డిస్ట్రక్షన్ అంటూ.. జగన్ ఏబీసీడీ పాలన చేస్తున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు. దీనికి అంతే గట్టిగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు విజయసాయిరెడ్డి. ఏబీసీడీ.. అంటే, ఆల్ బేవర్స్, చీటర్స్ అండ్ డెకాయిట్స్ పార్టీ తెలుగుదేశం అని కొత్త అర్థం చెప్పారు. విశాఖ కేంద్రంగా టీడీపీ, వైసీపీ మధ్య పోరు మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉంది.

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, వైసీపీ, టీడీపీ రెండూ బంద్ లో పాల్గొన్నా కూడా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో విశాఖను అభివృద్ధి చేసింది మేమేనంటే మేమేనంటూ గొప్పలు చెప్పుకున్నారు.
విశాఖ భూముల్ని చంద్రబాబు గద్దలకు కట్టబెడితే.. తాము పేదలకు పంచుతున్నామని అన్నారు విజయసాయిరెడ్డి. విశాఖను భూ రాబంధులు, కబ్జాలు లేని నగరంగా మార్చాలన్నదే సీఎం జగన్ లక్ష్యం అని చెప్పారాయన. ఉత్తరాంద్ర ద్రోహులను విశాఖలో అడుగు పెట్టనివ్వొద్దని, చంద్రబాబు సినిమాకు స్థానిక సంస్థల ఎన్నికలతో ప్రజలు ముగింపు పలకబోతున్నారని అన్నారు. పురపాలక ఎన్నికలతో టీడీపీ కథ ముగిసిపోతుందని జోస్యం చెప్పారు.

సింహం కడుపున సింహమే పుడుతుందన్నట్టుగా వైఎస్ఆర్ కడుపున జగన్ పుట్టారని, నక్క కడపున నక్క పుట్టినట్టుగా చంద్రబాబుకి లోకేష్ పుట్టాడని ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి.  కపటం, కుట్రలు, కుతంత్రాలు.. వెన్నుపోట్లు.. ఇదే చంద్రబాబు జీవితం అని, బాబు రాజకీయ ప్రస్థానంలో ఎక్కడా నిజాయితీ లేదని అన్నారు. 1.9 లక్షల ఇళ్ళను విశాఖలో పేదలకు ఇవ్వబోతున్నట్టు తెలిపారు విజయసాయిరెడ్డి. కులాలు, మతాలకు అతీతంగా, అన్ని వర్గాలకు మంచి చేసే ముఖ్యమంత్రి జగన్ అని, కొంతమందికే మేలు చేసే ముఠా వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. జగన్ అందరివాడు అయితే, బాబు ముఠా నాయకుడిగా మిగిలిపోయారని అన్నారు. ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖకు రాకూడదని చంద్రబాబు అడ్డుపడుతున్నారని, అమరావతిలోనే రాజధాని ఉండాలనేది ఆయన అభిమతం అని అన్నారు. అలాంటి ఆలోచనలున్న ఉత్తరాంద్ర ద్రోహుల్ని ఇక్కడి ప్రజలు అడుగు పెట్టనివ్వకూడదని పిలుపునిచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: