కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పుండుమీద కారం చల్లేలా వ్యాఖ్యానించారు. ఓవైపు ప్రజలు పెట్రో భారం పెరిగిపోతోందని కలవరపడుతుంటే ఆర్థిక మంత్రి చేసిన వ్యాఖ్యలు ఉపశమనం కలిగించేవి కాకుండా.. మరింత ఆగ్రహం తెప్పించేలా ఉన్నాయి. పెట్రో భారం పాపం కేంద్రానిదేనన్నది అందరికీ తెలిసిన విషయమే. కేంద్రం రేటు పెంచడంతో రాష్ట్రాల పన్నులు, ఇతర వడ్డనలు కలిపి మొత్తం భారం ప్రజలపై పడుతోంది. అయితే ఇప్పుడు కేంద్రం కొత్తగా రాష్ట్రాలను కలుపుతూ మెలిక పెట్టడం విశేషం.  

పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గించాలన్న వినియోగదారుల డిమాండ్‌ ధర్మబద్ధమైనదేనని అన్నారు నిర్మలా సీతారామన్. అయితే, కేంద్రంతో పాటు రాష్ట్రాలూ సంయుక్తంగా పన్నుల్లో కోత విధించుకునేందుకు సిద్ధపడితేనే ఇది సాధ్యమవుతుందని స్పష్టం చేశారామె. దేశంలోని పలు రాష్ట్రాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100 మించిపోయిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

చమురు ధరలపై ధర్మసంకటం ఏర్పడిందని ఇది వరకే తాను చెప్పానని గుర్తు చేశారు నిర్మలా సీతారామన్. వాటిపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించాలని, పెట్రో ఉత్పత్తులపై కేంద్రం వసూలు చేసే సుంకాల్లో 41 శాతం వాటా రాష్ట్రాలకూ వెళ్తుందని అన్నారు. ఆ వాటాను తగ్గించుకోడానికి రాష్ట్రం చర్యలు తీసుకుంటే పెట్రో రేట్లు తగ్గుతాయని చెప్పారు. పెట్రో ఉత్పత్తులను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే లీటరు పెట్రోల్‌ ధర రూ.75కు, డీజిల్‌ ధర రూ.68కి దిగి వస్తుందన్న ఆర్థిక నిపుణుల సూచనను కూడా జర్నలిస్ట్ లు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన నిర్మల, జీఎస్టీ మండలి ఈ అంశాన్ని చేపడితే నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుందని క్లారిటీ ఇచ్చారు. మొత్తమ్మీద.. పెట్రో భారం తగ్గాలంటే రాష్ట్రాలు త్యాగం చేయాలని పరోక్షంగా హింటిచ్చారు నిర్మలా సీతారామన్. అసలే పన్ను వాటాల్లో కోతలు విధించి రాష్ట్రాలపై భారం మోపుతున్న కేంద్రం.. మరోవైపు పెట్రో ఉత్పత్తుల రేట్లను విపరీతంగా పెంచేసి, ఆ పాపాన్ని రాష్ట్రాలు కడుక్కోవాలని చెప్పడం విడ్డూరం. 

మరింత సమాచారం తెలుసుకోండి: