పుర‌పాల‌క సంఘాల్లో ఎలాగైనా త‌మ పార్టీ జెండాను రెప‌రెప‌లాడించాల‌నే దృక్పథంతో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి అన్ని ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకొని ముందుకు వెళుతోంది. సామ‌, దాన‌, బేధ దండోపాయాలుప‌యోగించైనా త‌మ హ‌స్త‌గ‌తం చేసుకోవ‌డానికి ఆ పార్టీ నేత‌లు సిద్ధ‌ప‌డుతున్నారు. బెదిరింపు, భ‌య‌పెట్ట‌డాలు, ప్ర‌లోభాలు, దౌర్జ‌న్యాలు, బ‌ల‌వంత‌పు ఉప‌సంహ‌ర‌ణ‌లు, సంత‌కాల ఫోర్జ‌రీల్లాంటివెన్నో జ‌రిగాయి. అధికార‌మే అండ‌గా చెల‌రేగిపోతున్నవారిని త‌ట్టుకొని గుంటూరు జిల్లాలో ఒక్క‌డు నిల‌బ‌డ్డాడు. ఒకేఒక్క‌డు అని అనిపించుకుంటున్నాడు.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గుంటూరు జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున కేవ‌లం ఇద్ద‌రు మాత్ర‌మే ఎమ్మెల్యేలుగా ఎన్నిక‌య్యారు. వారిలో గుంటూరు ప‌శ్చిమ నుంచి మ‌ద్దాలి గిరి, రేప‌ల్లె నుంచి అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల్లో మ‌ద్దాలి గిరి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ మాత్రం తాను న‌మ్ముకున్న, త‌న‌ను న‌మ్ముకున్న‌ పార్టీ కోసం నిల‌బ‌డ్డారు. త‌మ పార్టీలో చేర‌క‌పోతే ఆర్థిక మూలాలు దెబ్బ‌తీస్తామ‌ని, నియోజ‌క‌వ‌ర్గంలో తిరిగే ప‌రిస్థితులు కూడా ఉండ‌వ‌నే బెదిరింపులు ఎన్నివ‌చ్చినా వాట‌న్నింటిని త‌ట్టుకొని నిల‌బ‌డ‌టంతోపాటు పార్టీని కూడా నిల‌బెడుతున్నారు.

అధికార పార్టీ ఒత్తిడుల‌ను త‌ట్టుకొని  పంచాయితీ ఎన్నిక‌ల్లో కొంద‌రు తెలుగుదేశం మ‌ద్ద‌తుదారుల‌ను గెలిపించుకోగ‌లిగారు. అలాగే ప‌ట్ణణంలో ప‌ట్టుసాధించేందుకు మొత్తం 16 వార్డుల్లో పార్టీ అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టారు. వీరిని గెలిపించుకోవ‌డంకోసం అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ వ్యూహ‌ప్ర‌తివ్యూహాల‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ రెండు సంవ‌త్స‌రాల్లో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్ర‌భుత్వం ఏమీ అభివృద్ధి చేయ‌లేక‌పోయింద‌ని, అభివృద్ధి అనేది టీడీపీవ‌ల్లే సాధ్య‌ప‌డుతుంద‌నే విష‌యాల‌న్ని ప్ర‌జల్లోకి బ‌లంగా తీసుకువెళ్ల‌గ‌లుగు‌తున్నారు. వైసీపీ ప్ర‌లోభాల నుంచి అభ్య‌ర్థుల‌ను కాపాడుకోవ‌డంలో కూడా ఆయ‌న విజ‌య‌వంతం కాగ‌లిగారు. ఎన్నిక‌ల రోజు వ‌ర‌కు ఇదే ఊపుకొన‌సాగితే రేప‌ల్లె పుర‌పాల‌క సంఘ భ‌వ‌నంపై తెలుగుదేశం పార్టీ జెండా రెప‌రెప‌లాడ‌టం ఖాయ‌మ‌ని అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ మ‌ద్ద‌తుదారులు చెబుతున్నారు. ఎంత‌మంది పార్టీలు మారినా, ఎన్ని ప్ర‌లోభాలు వ‌చ్చినా వాటిని త‌ట్టుకొని నిల‌బ‌డ‌టంతోపాటు పార్టీని కూడా నిల‌బెడుతున్న నాయ‌కులే త‌మ‌కు కావాల‌ని అక్క‌డి ప్ర‌జ‌లు కూడా కోరుకుంటున్నారు. వారి న‌మ్మ‌కాన్ని, వారి ఆశ‌యాన్ని నిల‌బెట్టేందుకు ల‌క్ష్యం దిశ‌గా అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ ప‌య‌నం కొన‌సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: