నాలుగు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, గాంధీ కుటుంబ వార‌సురాలు ప్రియాంకాగాంధీ విస్తృతంగా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ఆమె సాధార‌ణ మ‌హిళ‌గా మారి తేయాకు తోట‌ల్లో కార్మికుల‌తో క‌ల‌సి ప‌నిచేస్తున్న వీడియోలు వైర‌ల్‌గా మారాయి. కాంగ్రెస్ పార్టీ గెలుపు బాధ్య‌త‌ల‌ను అటు రాహుల్‌గాంధీ, ఇటు ప్రియాంకాగాంధీ త‌మ‌పై వేసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ఓవైపు రాహుల్‌గాంధీ త‌మిళ‌నాడులో చాలా రోజులు ప‌ర్య‌ట‌న‌లు చేశారు. అసోంలో ప్రియాంకాగాంధీ పార్టీలో ఊపు తీసుకువ‌చ్చార‌నే చెప్పాలి. అసోంలో ప్రియాంకా గాంధీ ప్రచారం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అసోంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. తేయాకు కార్మికురాలి అవతారమెత్తారు.


తేయాకు కార్మికులతో కలిసి పనిచేశారు. బిశ్వనాథ్ జిల్లాలో సదురు టీ గార్డెన్లో కార్మికులతో పాటు తానూ భుజానికి బుట్టు వేసుకొని తేయాకులు ఏరారు ప్రియాంక.ఇదిలా ఉండ‌గా ఎంపీ కార్తి చిదంబ‌రం చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి.కాంగ్రెస్ కేడర్‌లో ఉత్సాహం నింపాలంటే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలని ఆ పార్టీ ఎంపీ కార్తి చిదంబరం చాలా కాలంగా వాదిస్తున్న విష‌యం తెలిసిందే.  ఏప్రిల్ 6న తమిళనాడు శాసన సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ వర్గాల్లో ఉత్సాహం నింపడానికి ప్రియాంక గాంధీ..అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజే జరిగే కన్యాకుమారి లోక్ సభ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని కోర‌డం విశేషం.


 కాంగ్రెస్ నేత, కన్యాకుమారి సిట్టింగ్ ఎంపీ వసంత కుమార్ కొద్ది నెలల క్రితం కోవిడ్-19తో ప్రాణాలు కోల్పోవడంతో ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయాలని కార్తి చిదంబరం కోరారు. ఈ మేరకు ఆమెను అభ్యర్థిగా ప్రకటించాలని తాను రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల కమిటీకి వినతిపత్రం సమర్పించానని శుక్రవారం కార్తి చిదంబరం తెల‌ప‌డం గ‌మ‌నార్హం.  వాస్త‌వానికి కార్తీ చిదంబరం గ‌తంలోనూ ఇదే త‌ర‌హా డిమాండ్ చేశారు. సౌత్ నుంచి ప్రియాంకా పోటీ చేస్తే పార్టీ బ‌లోపేత‌మ‌వుతుంద‌ని వాదించాడు. మ‌రి దీనిపై ఆమె ఎలా స్పందిస్తార‌నేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: