ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగు దేశం నేతలు మరొకసారి తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. రాష్ట్రాన్ని జగన్ తన పరిపాలన విధానంతో ఛిన్నాభిన్నం చేస్తున్నారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊభీలోకి తోస్తున్నారని ఆయన విమర్శించారు. శుక్రవారం ఓ ప్రకటనలో యనమల రామకృష్ణుడు తెలుపుతూ జగన్ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో 60 నెలల్లో రూ.1.30 లక్షల కోట్లు అప్పు చేసి, అనేక అభివృద్ధి పథకాలు అమలు చేసినట్లు యనమల రామకృష్ణుడు తెలిపారు.

 అయితే జగన్మోహన్ రెడ్డి 20 నెలల్లోనే రూ.1.55 లక్షల కోట్లు అప్పు చేసి, ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయారని ఆయన మండి పడ్డారు. వైసీపీ సంక్షేమం మోసకారి సంక్షేమమే. కంటికి తెలియకుండా కాటుక కొట్టేయడమే అంటూ ఘాటు విమర్శలు చేశారు. కరోనా కాలంలో ఎలాంటి రాబడులు రాలేదని, అందువల్లే అధిక అప్పు చేయాల్సి వస్తోందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని తెలిపారు. 20 నెలల్లో తెచ్చిన అప్పులు, పెంచిన పన్నులు, ధరల పెంపుతో ఒక్కో కుటుంబంపై అదనంగా రూ.2.5 లక్షల భారం మోపారని యనమల రామకృష్ణుడు విమర్శించారు. 

ఇదిలా ఉండగా టి‌డి‌పి జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా సి‌ఎం జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్‌ సన్నిహితులు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారంటూ కేంద్రానికి విదేశీ సంస్థల నుంచి ఫిర్యాదులు అందాయని నారా లోకేష్ అన్నారు. అంతే కాకుండా ‘‘ఢిల్లీ పెద్దల పాద పూజ రాష్ట్రం కోసం కాదు, కేసుల మాఫీ కోసమే అని తేలిపోయింది. జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు చూస్తుంటే త్వరలోనే వైఎస్‌ జగన్‌, ఆయన డెకాయిట్‌ బ్యాచ్‌కు మరోసారి చిప్పకూడు ఖాయం అని స్పష్టమవుతోంది. ఈసారి ఏకంగా విదేశీయులు, జగన్‌రెడ్డి గ్యాంగ్‌ అర్థిక నేరాలపై ఫిర్యాదు చేశారు. ఇక చంచల్‌గూడ కాదు... విదేశీ జైలే’’ అని లోకేష్ ట్విట్టర్ లో రాసుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: