ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార పార్టీ నుంచి అధ్యక్షుడు జగన్ కనీసం ఒక్క జిల్లాలోనూ పర్యటించకుండా  అంతా తాడేపల్లి నుంచే కథ నడిపించేస్తున్నారు. కానీ.. ప్రతిపక్షం మాత్రం ఎలాగైనా ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌, వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ.. అందరూ ప్రచార రంగంలోకి దిగారు.

ఈ ఎన్నికలు విపక్ష టీడీపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. సాధారణంగా అధికార పార్టీకే అనుకూలంగా ఉంటాయి స్థానిక సంస్థల ఎన్నికలు. ఆ విషయం అందరికీ తెలిసిందే. కానీ.. మరో ఘోర ఓటమి ఎదురైతే తెలుగుదేశం శ్రేణులు పూర్తి నైరాశ్యంలో కూరుకుపోతాయి. అది పార్టీకి ఏమాత్రం మంచింది. కాదు.. నామినేషన్లు ముగిసిన తర్వాత ఇప్పటికే దాదాపు 20 శాతం పురపాలకాలు వైసీపీ ఖాతాలోకి వెళ్లిపోయాయి. అందుకే మిగిలిన వాటిలో గౌరవప్రదమైన స్కోరు రాకపోతే.. పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకకమవుతుంది.

అందుకే చంద్రబాబుతో పాటు లోకేశ్, బాలయ్య కూడా రంగంలోకి దిగారు. ఇక బాలకృష్ణ.. మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో పెద్దగా దృష్టి పెట్టలేదు. దీంతో ఆయన సొంత నియోజకవర్గంలో ఫలితాలు దారుణంగా వచ్చాయి. అందుకే.. పురపాలల్లోనైనా కాస్త గౌరవప్రదమైన స్కోరు సంపాదించాలని బాలయ్య రంగంలోకి దిగారు.

చంద్రబాబుకు సైతం పంచాయతీ ఎన్నికల్లో సొంత నియోజకవర్గం కుప్పంలో ఘోర ఓటమి ఎదురైన సంగతి తెలిసిందే. అందుకే.. పూర్తిగా చేతులు ఎత్తేసినట్టు కనిపిస్తే.. పార్టీ శ్రేణులు పూర్తిగా డీలా పడిపోతాయన్న ఆందోళన టీడీపీ నేతల్లో కనిపిస్తోంది. అందుకే చివరి నిమిషయం వరకూ పూర్తి స్థాయిలో పోరాడాలని టీడీపీ  అగ్రనాయకత్వం నిర్ణయించింది. దీనికి తోడు ఇటీవల అందివచ్చిన విశాఖ ఉక్కు ఉద్యమం నుంచి కూడా వీలైనంత ఎక్కువగా రాజకీయ లబ్ది పొందేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. మరి అంతిమ ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి. అటు వైసీపీ మాత్రం ఫలితాలపై పూర్తి ధీమాగా ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: