త్వ‌ర‌లోనే డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సులు హైద‌రాబాద్ రోడ్ల‌పై తిరుగాడ‌నున్నాయి. గ‌తంలో మంత్రి కేటీఆర్ ఆదేశాల‌తో ఆర్టీసీ అధికారులు డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సుల కొనుగోలుకు సిద్ధ‌మైన విష‌యం తెలిసిందే. ఒక‌ప్పుడు హైద‌రాబాద్‌కు ఐకాన్‌గా ఉన్న డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సులు మ‌ళ్లీ రోడ్ల‌పై సంద‌డి చేయ‌నుండ‌టంతో న‌గ‌ర పౌరుల‌తో పాటు తెలుగువారంతా ఆస‌క్తిగా దీనికోసం ఎదురు చూస్తున్నారు.ఆర్టీసీ అధికారులు చెబుతున్న దాని ప్ర‌కారం.. సిటీలో డబుల్ డెక్కర్ బస్సులు వచ్చే దసరాకు రోడ్డెక్కనున్నాయి. ఇప్పటికే 25 బస్సులకు టెండర్‌‌ ప్రక్రియ పూర్తవగా ఓపెన్ చేశారు. బస్సుల తయారీకి టీఎస్‌ ఆర్టీసీ టెండర్లను ఆహ్వానించగా.. అశోక్‌ లేలాండ్‌ సంస్థ టెండర్‌ దాఖలు చేసింది.


తొలిదశ 25 బస్సులు కావాలని టీఎస్‌ ఆర్టీసీ కోరింది. దీంతో బస్సులను సమకూర్చేందుకు లేలాండ్‌ సంస్థ ముందుకు వచ్చింది. డబుల్‌ డెక్కర్‌ బస్సుల టెండర్‌పై త్వరలో ఆర్థిక కమిటీ చర్చించనున్నది. ఈ కమిటీ ఆమోదముద్ర వేసిన వెంటనే సదరు సంస్థ బస్సులను సమకూర్చనుంది. బీఎస్ 6 రూల్స్కు అనుగుణంగా నాన్ ఏసీ డబుల్ డెక్కర్ బస్సులను అందుబాటులోకి తెస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. గత జనవరిలో ఆర్టీసీ టెండర్లు పిలిచింది. కానీ టెక్ని కల్ స్పెసిఫికేషన్ కోసం గడువును పెంచింది. దీంతో లేటైంది. అయితే బస్సులు మాన్యుఫాక్చర్, మోడిఫికేషన్‌‌కి టైమ్ పట్టేలా ఉండగా టెండర్లు వేసిన కంపెనీలు 150 రోజులు గడువు అడిగినట్లు అధికారులు చెప్పారు. డబులు డెక్కర్ బస్సులను తిప్పనున్న 5 రూట్లను కూడా గుర్తించారు.


గతంలో హైదరాబాద్ నగరంలో డబుల్ డెక్కర్ బస్సులను నడిపారు. మెహదీపట్నం – సికింద్రాబాద్‌ స్టేషన్, సికింద్రాబాద్‌–జూపార్కు, సికింద్రాబాద్‌–సనత్‌నగర్, మెహిదీపట్నం–చార్మినార్‌ మార్గాల్లో 16 ఏళ్ల క్రితం వరకు డబుల్‌ డెక్కర్‌ బస్సులు పరుగులు పెట్టాయి. ఆ బస్సు అప్పర్‌ డెక్‌లో కూర్చుని ట్యాంక్‌బండ్‌ మీదుగా ప్రయాణిస్తుంటే ఆ సరదానే వేరుగా ఉండేది. కానీ సాధారణ బస్సులతో పోల్చుకుంటే ఈ బస్సుల నిర్వహణ వ్యయం చాలా ఎక్కువ. అందుకే అప్పట్లో డిమాండ్‌ ఉన్నప్పటికీ నష్టాలు భరించలేక ఆర్టీసీ వాటిని వదిలించుకుంది. తాజాగా ప్రభుత్వ ఆదేశాలతో ఆర్టీసీ ఈ బస్సులు తీసుకుంటోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: