పోరాటాల పురిటిగ‌డ్డ బెజ‌వాడ‌లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ఎర్ర‌టి సూర్యుడి సాక్షిగా నిప్పులు చెరిగారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీపై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌జ‌ల‌చేత ఈ రౌడీల‌కు బ‌ట్ట‌లిప్పించ‌డం ఖాయమ‌న్నారు. బెజ‌వాడ క‌న‌క‌దుర్గ సాక్షిగా తాను రౌడీల‌కు రౌడీన‌ని, వైసీపీ గూండాల గుండెల్లో నిద్ర‌పోతానంటూ హెచ్చ‌రించారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయ రాజధాని విజయవాడలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చండ్రనిప్పులు కురిపించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు దుర్గమ్మ సాక్షిగా తాను రౌడీలకే రౌడీనని, వైసీపీ గూండాల గుండెల్లో నిద్రపోతానంటూ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నానిని హెచ్చ‌రించారు. ‘రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి  తాను పెద్ద రౌడీ అనుకుంటున్నాడు. ప్ర‌జ‌లు తిరగబడితే ఈ రౌడీలు పారిపోవడం ఖాయం. బట్టలిప్పించడం ఖాయం... జాగ్రత్త. సిగ్గు.. ఎగ్గు, మానం ఏమీ లేవు. అన్నిటినీ వదిలేశారు. దౌర్జన్యాలు చేసి గెలవాలనుకుంటున్నారు. అసలే ప్రతిపక్షం లేకపోతే... అడిగేవాడు లేకపోతే.. ఎలా? అటు విశాఖపట్నానికి విజయసాయి రెడ్డి శనిలా పట్టాడు'' అంటూ చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘‘ఒకడు బూతుల మంత్రి... నోరు పారేసుకుంటాడు.. పేకాట ఆడిస్తాడు. ఆడితే తప్పేముంది అంటాడు. ఘోరమైన నేరాలు చేసి ఎంత సింపుల్ గా సమాధానం చెబుతాడో. సమాధానం. అలాంటి వ్యక్తి నేరుగా తాడేపల్లిలో సీఎం దగ్గరకు వెళ్లి, దర్జాగా బయటకు వస్తాడు. అంటే తన దొంగ పనులకు సీఎం ఆశీస్సులు తీసుకున్నట్టా?'' అంటూ కొడాలిని ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు.  
రోడ్ షో మొత్తం ముఖ్య నేతలే ముందు వరుసలో ఉండ‌వ‌ద్ద‌ని, ఆయా వార్డుల్లో పార్టీ అభ్యర్థులను ముందుంచి ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ ముందుండాలో నాయకులు తెలుసుకోవాల‌ని, అభ్యర్థుల్ని ప్రజలకు పరిచయం చేస్తూ, వారిని ముందుంచడం వల్ల నాలుగు ఓట్లు ఎక్కువ వస్తాయని చంద్రబాబు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ మేయర్ పదవిని సాధించాలని, లేదంటే విజయవాడ జనం తలెత్తుకు తిరగలేరని చంద్రబాబు అన్నారు. అధికార వైసీపీ నేత‌లు ఏపీని నేరస్థుల అడ్డాగా తయారు చేస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: