తెలుగుదేశం పార్టీ ఈ మధ్య చాలా మందికి పార్టీ పదవులు పంపిణీ చేసింది. అందులో ఎక్కువగా యువత ఉన్నారు. అలాగే కొత్త వారూ కూడా ముందు వరసలోకి వచ్చారు. అయితే చూస్తూంటే వారి కంటే సీనియర్ల హవాయే పుర పోరు లో ఎక్కువగా కనిపిస్తోంది.

వ్యూహాలు వేయడంలో కానీ ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో కానీ తల పండిన సీనియర్లదే అగ్ర తాంబూలం అన్నట్లుగా సీన్ కనిపిస్తోంది. విశాఖ జిల్లా ఎలమంచిలి మునిసిపాలిటీకి రెండవ దఫా ఎన్నికలు జరుగుతున్నాయి. 2013 లో తొలిసారిగా జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. విశాఖ డైరీ చైర్మన్ ఆడారి తులసీరావు కుమార్తె రమాదేవి మొదటి చైర్ పర్సన్ గా రికార్డు సృష్టించారు. ఇపుడు ఆమె వైసీపీలో ఉండడంతో ఆ పార్తీలో జోష్ హుషార్ చాలానే కనిపిస్తోంది.

ఇక ఎలమంచిలి మునిసిపాలిటీలో 25 వార్డులు ఉన్నాయి. ఇందులో మూడు వైసీపీకి ఏకగ్రీవం అయ్యయి. మిగిలిన 22 వార్డులకు ఎన్నికలు ఈ నెల 10న జరగనున్నాయి. మునిసిపల్ చైర్మన్ సీటు పట్టాలంటే 13 మ్యాజిక్ ఫిగర్ గా ఉంది. ఇప్పటికే మూడు సీట్లను వైసీపీ గెలుచుకుంది కాబట్టి మరో పది సీట్లు తెచ్చుకుంటే సరిపోతుంది. మరో వైపు చూస్తే టీడీపీ మొత్తం 13 సీట్లను సాధించాలి. అంటే పోటీ జరుగుతున్న 22లో 13 సాధించడం బిగ్ టాస్క్ అనే చెప్పాలి. కానీ టీడీపీ తరఫున మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు గట్టిగానే కృషి చేస్తున్నారు. ఆయన తన సీనియారిటీని అనుభవాన్ని జోడించి మరీ రంగంలోకి దూకేశారు. తనను తొలిసారి ఓడించిన ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబురాజు తో ఢీ కొడుతున్నారు. మరి ఆయన వ్యూహాలు ఫలిస్తాయా, టీడీపీ గెలుపు సాధ్యమేనా అంటే చూడాలి. ఏది ఏమైనా ఇక్కడ పోటా పోటీగానే సీన్ ఉందని చెప్పాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: