శతకోటి లింగాల్లో బోడిలింగం ఎవరో నాకెలా తెలుసంటూ.. గతంలో మంత్రులు నాని లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు పవన్ కల్యాణ్. అప్పుడే నానీలంతా పవన్ పై మూకుమ్మడిగా ప్రతివిమర్శలతో విరుచుకుపడ్డారు. అయితే ఇప్పటికీ ఆ హీట్ తగ్గలేదు. పవన్ కల్యాణ్ పేరు చెబుతేనే మంత్రులు తీవ్ర స్తాయిలో ధ్వజమెత్తుతున్నారు. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై పవన్ చేసిన వ్యాఖ్యల్ని తప్పుబట్టారు మంత్రి పేర్ని నాని, రౌడీరాజ్యం అంటూ పవన్ మాట్లాడటాన్ని కూడా ఆయన ఖండించారు. పవన్ కల్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఇకనైనా ప్రజల్ని మోసం చేయడం ఆపాలని అన్నారు.  

‘జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీ పర్యటనకు వెళ్లి ఏం మాట్లాడి వచ్చారు? గతంలో అవసరమైతే కేంద్రాన్ని విజయవాడ వీధుల్లోకి తీసుకొస్తామని చెప్పారుకదా? ఇప్పుడు తీసుకు రావాలి కదా, తీసుకొచ్చి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపేయాలిగా? మీరు ఒక్క మాట చెబితే అయిపోతుందిగా?’ అని ఎద్దేవా చేశారు మంత్రి పేర్ని నాని. పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లినా ఏమీ జరగదని, కేంద్రాన్ని నిలదీసేంత దమ్ము ఆయనకు లేదని అన్నారు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ కేంద్రంతో లాలూచీ పడి వచ్చేస్తారని, ప్రజలకోసం ఆయన కేంద్రాన్ని ఎదిరించలేరని అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషిగా చిత్రీకరిస్తూ పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యల్ని ఖండించారు మంత్రి పేర్ని నాని. ప్రైవేటీకరణ వ్యవహారం కేంద్రం చేతుల్లో ఉందని, పవన్ కల్యాణ్ ఏమైనా చేయాలనుకుంటే కేంద్రాన్ని ఒప్పించాలని అన్నారు. పదే పదే రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు.

రాష్ట్రంలో రౌడీ రాజ్యం ఉందంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కూడా మండిపడ్డారు మంత్రి నాని. రాష్ట్రంలో నిజంగానే రౌడీ రాజ్యం ఉంటే.. పవన్ కల్యాణ్ ఇలా ప్రచారాలకు వెళ్లేవారా అని ప్రశ్నించారు. సినిమా డైలాగులు కొట్టడం మాని, రాజకీయాలపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. రాష్ట్రంలో శాంతి భద్రతల వ్యవహారంపై పవన్ కల్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. ఇక స్థానిక ఎన్నికల్లో జనసేన అపవిత్ర పొత్తులు పెట్టుకుంటుందని విమర్శించారు నాని. పవన్ తన‌ పార్టీ బీఫారాలు వేరే వాళ్ల చేతిలో పెట్టారని, టీడీపీతో కలసి పోయారని ఎద్దేవా చేశారు. సినిమాకు వచ్చి వెళ్లినట్లు పవన్ కల్యాణ్ రాష్ట్రానికి వచ్చి వెళ్తున్నారని.. ఇకనైనా ప్రజల్ని మోసం చేయడం ఆపాలని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: