మున్సిపల్ ఎన్నికల వ్యవహారంతో విశాఖ రాజకీయం వేడెక్కింది. చంద్రబాబు, నారా లోకేష్  సహా కీలక నేతలంతా విశాఖ కేంద్రంగా రాజకీయాలు మొదలు పెట్టారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రధాన అంశం కాగా.. విశాఖలో కబ్జా బాగోతం అంటూ ఇటీవల చంద్రబాబు, అధికార పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. కబ్జా రాయుళ్ళని విశాఖకు దూరంగా ఉంచాలని అన్నారు. దీంతో వైసీపీ కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతోంది. విశాఖలో అసలైన అభివృద్ధి జరిగింది వైఎస్ఆర్ హయాంలో అని.. అవినీతి మాత్రం టీడీపీ హయాంలో జరిగిందని అంటున్నారు.

ఆనందపురం, భీమిలి, పరవాడ, పెందుర్తి తహశీల్దారు కార్యాలయాల్లో భూముల రికార్డులు తారుమారు చేసింది చంద్రబాబేనని అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. విశాఖలోని భూ యజమానుల ఇళ్లలో అసలు పత్రాలుంటే, ఆఫీసుల్లో మాత్రం పేర్లు, ఊర్లు మారిపోయాయని చెప్పారు. దీనంతటికీ కారణం చంద్రబాబేనని అన్నారు.

విశాఖ బీచ్‌ రోడ్డులోని 32 ఎకరాల్ని లూలూ సంస్థకు ఓ కన్వెన్షన్‌ సెంటర్‌ కట్టడానికని గత ప్రభుత్వం ఇచ్చిందని, దాని వల్ల విశాఖ ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. కేవలం ఒక కన్వెన్షన్ సెంటర్ తోనే విశాఖలో అభివృద్ధి పరుగులు పెడుతుందా అని అన్నారు. లూలు సంస్థ కేవలం ఒక డెవలపర్ అని, వాళ్లని తలదన్నేవారు వందలమంది ఉన్నారని చెప్పారు.

వైసీపీ హయాంలో విశాఖ అభివృద్ధిలో ముందడుగు..
విశాఖకే తలమానికంగా ఉండేలా కార్యాచరణ వైసీపీ ప్రభుత్వం రూపొందించిందని చెప్పారు బొత్స. దీనిపై ముఖ్యమంత్రితో చర్చించి గ్లోబల్‌ టెండర్లకు వెళ్తున్నామని అన్నారు. అప్పట్లో జీవీఎంసీ భవనాలు తాకట్టు పెట్టారని టీడీపీపై విమర్శలు చేశారు. దాన్ని రీషెడ్యూలు చేసి స్మార్ట్‌సిటీ నిధులతో జీవీఎంసీకి భారం తగ్గించామని చెప్పారు బొత్స. మున్సిపల్ ఎన్నికల కారణంగానే విశాఖ అభివృద్ధి చంద్రబాబుకి గుర్తొచ్చిందని, మూడు రాజధానులకు అడ్డుపడింది ఆయన కాదా అని ప్రశ్నించారు. విశాఖకు పాలనా రాజధాని రాకుండా అడ్డుకుంటోంది బాబేనని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో విశాఖ వాసులు చంద్రబాబుకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: