నేటి సమాజంలో యువత చిన్న చిన్న కారణాలకే క్షణికావేశంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. తనను ప్రేమించలేదన్న కారణంతో యువతులను చంపుతున్న ఉదంతాలు ఇటీవల ఎన్నో జరిగాయి. తాజాగా ఓ యువతి మాత్రం ప్రేమ విఫలమయిందన్న ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా శాయంపేట మండలం పత్తిపాకకు చెందిన తుడుం శిరీష అనే యువతి తన తల్లితో కలిసి ఉంటోంది. తండ్రి కొన్నేళ్ల క్రితమే మరణించగా, తల్లి కూలి పనులు చేసుకుంటూ శిరీషను పోషిస్తోంది. శిరీష హన్మకొండలోని ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ సెకండియర్ చదువుతోంది. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం వరంగల్ నగరంలోని ఏనుమాముల ఎస్ఆర్ నగర్ కాలనీకి చెందిన మర్రి కల్యాణ్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా కొద్ది రోజుల్లోనే ప్రేమగా మారింది. రెండేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని శిరీష తన తల్లికి చెప్పింది. తన కూతురి ప్రేమ పెళ్లికి తల్లి సరేనంది కూడా.

ఇక కల్యాణ్ ఇంట్లో మాత్రం వీరి ప్రేమ వ్యవహారానికి అడ్డుచెప్పారు. కొడుకు ప్రేమ పెళ్లికి వారు నో చెప్పారు. దీంతో శిరీష మనస్తాపానికి గురయింది. అయితే కూతురు దిగాలుగా ఉండటంతో తల్లి నచ్చజెప్పింది. త్వరలోనే పెద్దమనుషులతో వెళ్లి కల్యాణ్ తల్లిదండ్రులతో మాట్లాడి సంబంధం ఖాయం చేస్తాననీ, ఓపిక పట్టాలని తల్లి ఓదార్పు మాటలు చెప్పింది.

అయితే తన ప్రియుడితో పెళ్లి జరిగే పరిస్థితులు లేవని నిర్ణయానికి వచ్చిన కల్యాణి శుక్రవారం దారుణ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఉదయం తల్లి కూలి పనులకు వెళ్లగా, శిరీష పురుగుల మందు తాగి ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న శిరీషను గమనించిన స్థానికులు, విషయాన్ని ఆమె తల్లికి చెప్పారు. దీంతో ఆమె 108 కు సమాచారం అందించింది. చికిత్స పొందుతూనే శనివారం శిరీష మృతిచెందింది. కాగా, ఈ తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: