పురపాలక ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. నేటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈనెల పదినే పోలింగ్.. అయితే ఇది చాలా కీలక సమయం.. ఇలాంటి సమయంలో పార్టీలో కుమ్ములాటలు ఉంటే.. పరిస్థితి ఏమవుతుంది.. అదే జరుగుతోంది.. విజయనగరం జిల్లా సాలూరు మున్సిపాలిటీలో.. ఇక్కడ టీడీపీ నేతలు వర్గ విబేధాలతో ఎవరికి వారే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. అయితే ఈ విబేధాలకు ఇటీవల పార్టీ టికెట్ కేటాయింపులో వచ్చిన విబేధాలే కారణంగా తెలుస్తోంది.

పార్టీలో కష్టపడి పనిచేసే తనకు కాకుండా డబ్బులకు అమ్ముడుపోయి ఇంకెవరికో టికెట్టు ఎలా ఇస్తారు.. అంటూ ఇటీవల ఓ డీపీ మహిళా నేత ఏకంగా మాజీ ఎమ్మెల్యే ఆర్‌.పి.భంజ్‌దేవ్‌ ను ప్రశ్నించింది. అలా ప్రశ్నించిన ఆమెను సదరు మాజీ ఎమ్మెల్యే గెంటేసిన ఘటన ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగిందంటే.. పార్టీ టికెట్‌ ఇస్తామని నియోజకవర్గ నాయకులు హామీ ఇవ్వడంతో సాలూరు మున్సిపాలిటీలో బంగారమ్మపేట 25వ వార్డు నుంచి టీడీపీ అభ్యర్థిగా కొయ్యాన లక్ష్మి నామినేషన్‌ వేశారు.

అయితే.. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన బుధవారం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ఆర్‌.పి.భంజ్‌దేవ్‌ ఇంటికి రమ్మని చెప్పడంతో లక్ష్మి, ఆమె భర్త, మద్దతుదారులతో కలిసి వెళ్లారు. ‘నీవు ఎంత ఖర్చు పెడతావ్, టికెట్‌కు రూ.5 లక్షలు ఇవ్వాలి. నీవు ఎంత ఇవ్వగలవు’ అని భంజ్‌దేవ్‌ అడుగగా, రూ.4 లక్షలు ఇవ్వగలమని తెలిపారు. అక్కడే ఉన్న మరో అభ్యర్థి ఇంకా ఎక్కువ ఇస్తాననడంతో ఒక్కసారిగా సీన్‌ రివర్స్‌ అయిందని చెబుతున్నారు. లక్ష్మికి బీ –ఫారం ఇవ్వబోమని చెప్పేశారు.

ఇన్నేళ్లుగా పార్టీని నమ్ముకున్న మమ్మల్ని కాదని వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి డబ్బులు తీసుకుని టికెట్‌ ఇవ్వడం ఎంతవరకు న్యాయం అంటూ లక్ష్మీ, ఆమె భర్త మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్‌ను ప్రశ్నించారు. అసహనానికి గురైన భంజ్‌దేవ్‌.. లక్ష్మి చేయి పట్టుకుని బయటకు పొమ్మంటూ నెట్టేశారు. ‘నాకు నచ్చిన వారికే టికెట్‌ ఇస్తా, చేతనైంది చేసుకో..’ అంటూ దురుసుగా ప్రవర్తించారు. ఈ సంఘటనను అక్కడున్నవారు సెల్‌ఫోన్లో చిత్రీకరించడంతో ఇది లోకల్‌గా బాగా  వైరల్‌ అయింది. ఇప్పుడు దీని ప్రభావం ఫలితాలపైనా పడుతుందని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: