గుంటూరు జిల్లా టీడీపీలో అనేక మంది నాయ‌కులు ఉన్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఎంతో మంది ఉన్నారు. అయితే.. గ‌త 2019 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన వారు ఇద్ద‌రు మాత్రమే. వారిలోనూ గుంటూరు వెస్ట్ నుంచి విజ‌యం సాధించిన మ‌ద్దాలి గిరిధ‌ర్‌.. వైసీపీకి మ‌ద్ద‌తుగా మారిపోయారు. ఇక‌, మిగిలింది రేప‌ల్లె ఎమ్మెల్యే అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్‌. ఈయ‌న వ‌రుస‌గా రెండు సార్లు విజ‌యం సాధించారు. చంద్ర‌బాబు పాల‌న స‌మ‌యంలో రేప‌ల్లెలో ఆయ‌న చేసిన అబివృద్ధికి మెచ్చిన ప్ర‌జలు.. 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ దూకుడు, జ‌గ‌న్ సునామీ ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న‌కు ప‌ట్టం క‌ట్టారు.

ఇక‌, ఇప్పుడు రేప‌ల్లె మునిసిప‌ల్ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో అన‌గాని దూకుడు ఓ రేంజ్‌లో ఉంద‌నే చెప్పాలి.  వైసీపీలో ఉన్న కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణ‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తోన్న ప‌రిస్థితి. మోపిదేవి 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిపోయారు. అయినా జ‌గ‌న్ మాత్రం ఎమ్మెల్సీని చేసి మరీ ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. త‌ర్వాత‌.. బీసీ కోటాలో రాజ్య‌స‌భ‌కు పంపించారు. ఇంత‌గా జ‌గ‌న్ ప్రాధాన్యం ఇస్తూ.. వైసీపీలో కీల‌క నేత‌గా చూస్తున్నారు. అయితే.. మోపిదేవికి మాత్రం స్థానికంగా రేపల్లెలో ఇప్ప‌ట‌కీ ప‌ట్టు చిక్క‌డం లేదు.

అన‌గాని దూకుడుతో రేప‌ల్లె వైసీపీలో గుబులు ప‌ట్టుకుంది. రేప‌ల్లెలో వైసీపీని అడ్డుకునేందుకు ఎమ్మెల్యే స‌త్య‌ప్ర సాద్ స్వ‌యంగా రంగంలోకి దిగారు. ప్ర‌తి నేత వెంటా తిరుగుతున్నారు. టీడీపీ అభ్య‌ర్తుల‌ను గెలిపించాలంటూ.. అభ్య‌ర్థిస్తున్నారు. మొత్తం 28 వార్డుల్లో 4 వార్డులు వైసీపీకి ఏక‌గ్రీవం అయ్యాయి. 24 వార్డుల్లో టీడీపీ 23 చోట్ల పోటీ చేస్తుండ‌గా.. వైసీపీ 24 చోట్లా పోటీ చేస్తోంది. మునిసిప‌ల్ చైర్మ‌న్ ప‌ద‌వి ఎస్టీ మహిళ‌కు రిజ‌ర్వ్ చేశారు.

వైసీపీ వాళ్లు వ‌లంటీర్ల‌తో ఎన్ని బెదిరింపుల‌కు దిగినా.. ఎంత‌గా ప్ర‌లోబ పెట్టినా త‌మ‌దే గెలుపు అని టీడీపీ వాళ్లు చెపుతున్నారు. అనగాని వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ‌ల‌తో పాటు ఆయ‌న ఎప్పుడూ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండే తీరే ఈ రోజు రేపల్లెలో పార్టీకి ప్ల‌స్ అవుతోంది. దీంతో ఒక‌ర‌కంగా.. వైసీపీ వెనుక‌బ‌డిన‌ట్టే క‌నిపిస్తోంది. ముఖ్యంగా మాజీ మంత్రి వెంక‌ట ర‌మ‌ణతో పాటు ఆయ‌న కుమారుడు, కుటుంబ స‌భ్యులు అన‌గానిని ఢీ కొట్టి నిలిచేందుకు గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌రి ఈ పోరులో ఏం జ‌రుగుతుందో ?  చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: