నువ్వా నేనా అన్నట్లుగా ఎన్నికలు. చావో రేవో అన్నట్లుగా పోటా పోటీ. దాంతొఅ  ఏ చిన్న అవకాశం కూడా వదలకూడదని అటూ ఇటూ గట్టిగానే చూస్తున్నాయి. ఈ నేపధ్యంలో విశాఖలో టీడీపీకి ఆశలు పెంచే పరిణామాలు కొన్ని  చోటు చేసుకుంటున్నాయి. దాంతో  తమ్ముళ్లకు  ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.

ఇంతకే ఆ పరిణామాలు ఏంటి అంటే టీడీపీకి అంటీ ముట్టనట్లుగా ఉంటూ వస్తున్న ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలుగుదేశంలోనే కొనసాగుతానని గట్టి సంకేతాలు ఇవ్వడం. అంతే కాదు, చంద్రబాబుని మించిన నాయకుడు లేడంటూ కితాబు ఇవ్వడం. తాను వైసీపీలో ఎపుడూ చేరాలనుకోలేదు అని ఖరాఖండీగా చెప్పడం. ఈ పరిణామాలతో గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ ఉత్తర నియోజకవర్గంలో టీడీపీ అవకాశాలు ఒక్కసారిగా మెరుగుపడ్డాయి. అంతే కాదు, గంటా ప్రభావం విశాఖ అంతటా ఉంటుంది కాబట్టి చాలా చోట్ల ఆయన అండా దండా తమకే దక్కుతాయని కూడా టీడీపీ నాయకులు ఆనందిస్తున్నారు. గంటా విశాఖ టీడీపీకి బలమైన నాయకుడు.

ఆయన 2007లో తొలిసారిగా జీవీఎంసీకి ఎన్నికలు జరిగితే ఒంటిచేత్తో పార్టీని గెలిపించాడు. ఈసారి ఆయన కాస్తా ఎడం పాటించడం, పార్టీకి దూరంగా ఉండడంతో టీడీపీ సరైన నాయకత్వం లేక డీలా పడింది. అయితే గంటా మాత్రం తాను చంద్రబాబుకు దూరం ఎపుడూ కావాలనుకోలేదు అంటూ స్టేటెమెంట్ ఇవ్వడం, తమ మధ్య ఉన్నవి చిన్న పాటి విభేధాలే అని క్లారిటీగా చెప్పడంతో ఆయన టీడీపీని వీడిపోరు అన్న ధైర్యం క్యాడర్ కి వచ్చింది. గంటా కనుక దన్నుగా ఉంటే విశాఖలో టీడీపీ సీన్ వేరేగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మొత్తానికి గంటా తాజా స్టాండ్ తో సైకిల్ జోరు చేస్తుందని అంటున్నారు. మొత్తానికి టగ్ ఆఫ్ వార్ గా సాగుతున్న జీవీఎంసీ పోరులో గంటా ప్రభావం చాలానే ఉంటుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: