త‌మిళ‌నాడులో జ‌రుగుతున్న ఎన్నిక‌ల ప్ర‌చారం ఊపందుకుంటోంది. అధికార అన్నాడీఎంకే, ప్ర‌తిప‌క్ష డీఎంకే వాగ్బాణాలు సంధించుకుంటూనే సీట్ల పంప‌కాలు కూడా పూర్తిచేస్తున్నాయి. ప‌ది సంవ‌త్స‌రాలుగా అధికార పీఠానికి దూరంగా ఉన్న డీఎంకే ఈసారి ఎన్నిక‌ల్లో గెలుపొంద‌డానికి ఏ అవ‌కాశాన్ని వ‌దులుకోవ‌డానికి సిద్ధంగా లేదు. అధికార పీఠ‌మే ల‌క్ష్యంగా ఆ పార్టీ అధినేత‌కానీ, కార్య‌క‌ర్త‌లుకానీ ప‌నిచేస్తున్నారు.

స్టాలిన్‌ తనయుడు, డీఎంకే యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్‌కు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సీటు దక్కలేదు. ఆయనకు ప్రచార బాధ్యతలు అప్పగించాలని  స్టాలిన్  నిర్ణయించారు. చెన్నై పరిధిలోని థౌజెండ్‌లైట్స్‌ లేదా చేపాక్‌-ట్రిప్లికేన్‌ నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని ఉదయనిధి భావించారు. అయితే ఉద‌య‌నిధి ఆశ‌ల‌పై ఆయ‌న తండ్రి స్టాలిన్ నీళ్లు చ‌ల్లారు. రాష్ట్ర‌వ్యాప్తంగా డీఎంకే అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేయాలని పార్టీ అధిష్ఠానం ఉధ‌య‌నిధిని ఆదేశించింది.

చెన్నై పరిధిలోని థౌజెండ్‌లైట్స్‌ లేదా చేపాక్‌-ట్రిప్లికేన్‌ నియోజకవర్గాల నుంచి ఉధ‌య‌నిధి దరఖాస్తు చేసుకొని అభ్య‌ర్థుల ఎంపిక‌కు సంబంధించిన ఇంటర్వ్యూకు సైతం హాజరయ్యారు. ఉదయనిధిని స్టాలిన్ను డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్‌  ఇంటర్వ్యూ చేశారు. పార్టీ యువజన విభాగం నేతగా రాష్ట్రమంతటా ఎన్నికల ప్రచారం చేయాల్సిన బాధ్యత ఉదయనిధిపై ఉందని, ఆయనే స్వయంగా పోటీ చేస్తే, అన్ని చోట్లా ప్రచారం చేయలేరని స్టాలిన్‌, దురైమురుగన్‌ అభిప్రాయపడినట్టు సమాచారం. వారి సూచన మేరకు ఉదయనిధి పోటీ నుంచి విరమించుకున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయనకు పార్టీ ప్రచార బాధ్యతలను అప్పగిస్తూ డీఎంకే కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన జారీ చేసింది. ఈ నిర్ణయం వెనుక మరో రాజకీయ కారణం కూడా ఉందనే వాదన వినబడుతోంది. డీఎంకేకు కుటుంబమే పార్టీ అంటూ భార‌తీయ జ‌న‌తాపార్టీ  చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడానికి స్టాలిన్ తన కుమారుడిని పోటీకి దూరంగా ఉంచారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవ‌లే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వార‌స‌త్వ పార్టీ అంటూ విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. దీనికి విరుగుడుగా స్టాలిన్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు పార్టీవ‌ర్గాల స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: