నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీలకు ఎన్నికల జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో పార్ల‌మెంటు సమావేశాలకు ప్రాధాన్యం ఏర్పడింది. నేటితో ప్రారంభం కానున్న స‌మావేశాలు  ఏప్రిల్‌ ఎనిమిదో తేదీ వరకు అంటే దాదాపు నెల రోజుల పాటు కొన‌సాగాల్సి ఉంది. సోమవారం ఉదయం 11 గంటల నుంచి రెండు సభల్లో (లోక్‌సభ, రాజ్యసభ) ఏకకాలంలో కార్యకలాపాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నది.  పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీలకు మరో ఇరవై రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల్ని కుదించేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. అయితే ఎన్నికల నేప‌థ్యంలో కేవ‌లం రెండు వారాల‌కే ప‌రిమితం చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది.  అన్ని పార్టీలూ ఇందుకు సుముఖంగా ఉండడంతో ప్రారంభం రోజునే దీనిపై స్ప‌ష్టత రానుంద‌ని స‌మాచారం.


కరోనా దృష్ట్యా ఇంతవరకు రాజ్యసభను ఉదయం పూట, లోక్‌సభను సాయంత్రం నిర్వహించగా ఇప్పుడు రెండు సభలనూ ఉదయం 11 గంటలకే ప్రారంభించనున్నారు. ఈ సమావేశాల్లో పింఛను నిధి నియంత్రణ-అభివృద్ధి ప్రాధికారిక సంస్థ సవరణ బిల్లు, మౌలిక వసతుల కల్పనకు నిధులు సమకూర్చే జాతీయ బ్యాంకు బిల్లు, విద్యుత్తు సవరణ బిల్లు; క్రిప్టో కరెన్సీ, అధికారిక డిజిటల్‌ కరెన్సీ నియంత్రణ బిల్లులు సభ పరిశీలనలోకి రానున్నాయి. ఆర్థిక బిల్లుతో పాటు 2021-22 సంవత్సరానికి వివిధ గ్రాంట్ల డిమాండ్లకు ఆమోదం పొందడం ఈ సమావేశాల ప్రధాన ఉద్దేశం. అయితే  ఎన్నికల దృష్ట్యా వివిధ పార్టీల సీనియర్‌ నాయకులు ఈ సమావేశాలకు హాజరయ్యే సూచనలు కనిపించడం లేదు.


సమావేశాల్లో   వ్యవసాయ చట్టాలు, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, పెట్రోల్‌ ధరల పెరుగుదల, సామాజిక మాధ్యమాలపై విధించిన నిబంధనల గురించి ప్రశ్నించాల‌ని కాంగ్రెస్ వ్యూహాత్మ‌క‌త‌ను సిద్ధం చేసుకుంది.దేశవ్యాప్తంగా రెండో విడుత కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతున్నది. ఇందులో భాగంగా పార్లమెంటులోనూ మంగళవారం నుంచి కొవిడ్‌ టీకా పంపిణీ చేయనున్నారు. దీనికోసం ప్రత్యేకంగా రెండు వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో పార్లమెంటు సభ్యులతోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా టీకా తీసుకునే అవకాశం ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: