దివంగత  సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఖమ్మం జిల్లాలో  దుండగులు ధ్వంసం చేయడం తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపుతుంది. కొంత‌మంది కావాల‌నే ఈ దుశ్చ‌ర్యానికి పాల్ప‌డిన‌ట్లుగా వైఎస్సార్ అభిమానులు, ష‌ర్మిల అభిమానులు భావిస్తున్నారు. ఇటీవ‌ల‌  రఘునాథపాలెం మండలం శివాయిగూడెంలో రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్ అభిమానులు ఘటనా స్థలికి చేరుకుని ఆందోళనకు దిగారు. విగ్రహం ధ్వంసం చేసినవారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తాజాగా ఇదే డిమాండ్‌తో ష‌ర్మిల అభిమానులు, ష‌ర్మిల స్థాపించ‌బోయే పార్టీ అభిమానులు హైదరాబాద్‌ పంజాగుట్టలోని వైఎస్సార్‌ విగ్రహం దగ్గర వైఎస్‌ షర్మిల అనుచరులు ఆందోళనకు దిగారు.


ఖమ్మంలో వైఎస్సార్‌ విగ్రహ ధ్వంసం ఘటనను ఖండిస్తూ ధర్నా చేపట్టారు. రాజకీయంగా ఎదుర్కొలేకే ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఒక్క విగ్రహాన్ని ధ్వంసం చేస్తే.. తెలంగాణ వ్యాప్తంగా వేలాది విగ్రహాలు ఏర్పాటు చేసే అభిమానులు వైఎస్‌ సొంతమని చెప్పారు. విగ్రహం ధ్వంసం చేసిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. కూల్చివేసిన చోటే మళ్లీ వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ అభిమానులు శివాయిగుడెం చేరుకుంటారని ఆయన హెచ్చరికలు జారీ చేశారు.  ఏప్రిల్ 9 న సభ పెట్టి తీరుతామని.. విజయవంతం చేస్తామని చెప్పారు. మరోసారి ఇటువంటి ఘటనలకు పాల్పడితే వైఎస్ అభిమానులుగా తాటతీస్తామంటూ కాస్త ఘాటుగానే స్పందించారు



వచ్చే నెలలో ఖమ్మం జిల్లాలో వైఎస్ షర్మిల బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో విగ్రహ ధ్వంసం ఘటన కలకలం రేపింది. దుండగులు ధ్వంసం చేసిన విగ్రహాన్ని 2013లో వైఎస్ షర్మిల ఆవిష్కరించారు. షర్మిల ఆవిష్కరించిన విగ్రహాన్ని ధ్వంసం చేయడం చర్చనీయాంశమైంది. అప్పటి వైసీపీ నాయకులు పువ్వాడ అజయ్‌కుమార్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్లు కూడా శిలాఫలకంలో ఉన్నాయి. ఇదిలా ఉండ‌గా  తెలంగాణ రాజకీయాల్లో ష‌ర్మిల‌ ఇంకా పూర్తిస్థాయిలో అడుగు పెట్టకముందే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నట్టుగా రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: