విశాఖ ఓటర్లు విలక్షణ‌మైన తీర్పునే ఎపుడూ ఇస్తూ ఉంటారు. అది గత చరిత్రను చూస్తే అర్ధమవుతుంది. అందరూ నడిచే తోవలో వారు నడవమని ఇప్పటికే అనేక పర్యాయాలు నిరూపించుకున్నారు. విశాఖ నగరం వరకూ చూస్తే ఒకనాడు కాంగ్రెస్ కి కంచుకోట. ఆ తరువాత టీడీపీ వైపుగా జనం మొగ్గారు. ఇపుడు ఎటు ఉంటారు అన్నది చూడాల్సిన అవసరం ఉంది.

అది 1994 సంవత్సరం. డిసెంబర్ నెలలో జరిగిన ఉమ్మడి ఏపీ ఎన్నికల్లో ఎన్టీయార్ బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. రెండు నెలలు తిరిగకుండా 1995లో  స్థానిక సంస్థల ఎన్నికలు జరిపిస్తే విశాఖ మేయర్ సీటుని భారీ మెజారిటీతో  కాంగ్రెస్ కైవశం చేసుకుంది. అంటే విశాఖ వాసులు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతు పలికి మేయర్ సీటు వద్దకు వచ్చేసరికి మాత్రం ఏకంగా కాంగ్రెస్ కి జై కొట్టి షాక్ తినిపించారు అన్న మాట.

ఇక 2019 ఎన్నికల్లో చూస్తే విశాఖ సిటీలో వైసీపీ అభ్యర్ధులు ఓటమి పాలు అయ్యారు. ఇక రూరల్ అంతా కూడా ఒక్క సీటు పొల్లుపోకుండా వైసీపీ గెలిచినా కూడా సిటీ వరకూ వచ్చేసరికి మాత్రం మొండి చేయి చూపారు. మరి ఈ రెండేళ్ల కాలంలో సిటీలో వైసీపీ పట్ల ఆదరణ పెరిగిందా తరిగిందా అన్నది జీవీఎంసీ ఎన్నికల్లో తెలుస్తుంది. ఇక మరో వైపు చూస్తే టీడీపీకి గతసారి జనం ఆదరించారు. కానీ లోకల్ టీడీపీ  ఎమ్మెల్యేలు ఏం చేశారు అన్నది కూడా జనం తీర్పు ద్వారా తెలియచేస్తారు కదా అంటున్నారు. ఇంకోవైపు చూస్తే విశాఖను రాజధాని నగరంగా వైసీపీ పెద్దలు  ప్రకటించారు. దాని ప్రభావం ఏమైనా ఉంటుందా అన్నది కూడా ఈ ఎన్నికల ద్వారా తెలియనుంది. మొత్తానికి చూసుకుంటే జీవీఎంసీ ఎన్నికలు కాదు కానీ ప్రజలు ఇచ్చే తీర్పు మాత్రం విలక్షణమైనదిగా ఉంటుంది అంటున్నారు. చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: