ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. చివరి నిమిషం వరకు ప్రధాన పార్టీల నేతలతో పాటు అభ్యర్థులు సుడిగాలిలా ప్రచారం చేశారు. ఇంటింటికి తిరిగి ఓటర్లను తమకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. చివరి రోజు హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రచారంలో ఉద్రిక్తత తలెత్తింది. హిందూపురంలో   తిరుగులేని నేతగా నిలిచిన బాలయ్యకు వైసీపీ సెగ తగిలింది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కొన్ని రోజులుగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు బాలయ్య. మోత్కుపల్లిలో ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే బాలకృష్ణను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. స్థానిక ఎమ్మెల్యేను ప్రచారం చేయనీయకుండా అడ్డుకోవడంతో మోత్కుపల్లిలో ఉద్రిక్తత తలెత్తింది.

జై జగన్ నినాదాలు చేస్తూ బాలకృష్ణను వైసీపీ కార్యకర్తలు అడ్డగించారు. వైసీపీ కార్యకర్తలకు మద్దతుగా ఎమ్మెల్సీ ఇక్బాల్ అహ్మద్ మోత్కుపల్లి రావడంతో హైటెన్షన్ నెలకొంది. వైసీపీ కార్యకర్తలకు పోటీగా, బాలయ్యకు మద్దతుగా తెలుగు తమ్ముళ్లు సైతం భారీగా తరలివచ్చారు. ఇరు వర్గాలు మోహరించడం, పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీ, టీడీపీ కార్యకర్తలను కట్టడి చేయడం పోలీసులకు సవాల్ గా మారింది. అతికష్టం మీద ఇరువర్గాలను అక్కడి నుంచి తరలించారు పోలీసులు.

 ఎన్నికల ప్రచారంలో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే బాలకృష్ణ.
 తాను తిడితే తనకన్నా ఎక్కువ బూతులు తిట్టేవారు ఎవరూ ఉండరని అన్నారు. అయితే తనకు సంస్కారం ఉందని... సంస్కారానికి కట్టుబడే తాను పద్ధతిగా వ్యవహరిస్తున్నాని చెప్పారు. వైసీపీ నేతలు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ఎద్దేవా చేశారు.అధికారంలోకి వ‌చ్చిన రెండేళ్ల‌లో వైసీపీ ప్ర‌జ‌ల‌కు ఏం చేసిందో చెప్పే ధైర్యం ఆ పార్టీ నేత‌ల‌కు లేద‌ని అన్నారు. ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మాత్రం అభివృద్ధిని ప‌క్క‌న‌పెట్టి వీడియో గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటున్నార‌ని బాలకృష్ణ విమ‌ర్శించారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా జగన్ అపాయింట్‌మెంట్ ఇవ్వ‌ట్లేద‌ని చెప్పారు. త‌మ‌ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ లను మూసివేసి వైసీపీ స‌ర్కారు ప్రజల నోట్లో మట్టి కొట్టింద‌ని ఆయ‌న చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: