తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయ వేడి రాజేస్తున్నాయి. ప్రధాన పార్టీలన్నీ సవాల్ గా తీసుకోవడంతో గతంలో ఎప్పుడు లేనంతగా హోరాహోరీ పోరు సాగుతోంది. ప్రధాన పార్టీలు తమ బలగాలను మోహరించి ప్రచారం చేస్తున్నాయి. అయితే అధికార, విపక్షాలు ఎంతగా ప్రచారం చేస్తున్నా.. ఓటర్ల నుంచి వారికి స్పందన కనిపించడం లేదని తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థుల జోరు ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్- రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానంలో ఇండిపెండెంట్ గా బరిలో నిలిచిన గౌరీ సతీష్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. చాప కింద నీరులా ప్రచారం చేస్తూ.. ప్రధాన పార్టీలకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ ఎమ్మెల్సీ సీటు పరిధిలోని మూడు జిల్లాల్లోనూ ఆయన  ప్రచారానికి మంది స్పందన లభిస్తోందని తెలుస్తోంది.

ప్రైవేట్ కళశాలల యాజమాన్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా, కేజీ టు పీజీ జాక్ కన్వీనర్ గా ఉన్న గౌరీ సతీష్  సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన సతీష్.. నిరుద్యోగుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. తన విద్యా సంస్థల్లో లాభాపేక్ష చూసుకోకుండా... విద్యార్థులకు సాధారణ ఫీజులతో విద్య అందిస్తున్నారు. కొందరు పేద విద్యార్థులకు ఉచితంగానే తన విద్యాసంస్థల్లో అడ్మిషన్ ఇస్తుంటారు గౌరీ సతీష్. అంతేకాదు కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రజలకు అండగా నిలిచారు. నిరుపేదలకు నిత్యావసరాలు అందించారు. ముఖ్యంగా స్కూల్స్, కాలేజీలు మూత పడటం, యజమాన్యాలు పట్టించుకోకపోవడంతో రోడ్డున పడిన ప్రైవేటు కాలేజీ లెక్చరర్లు, ఉపాధ్యాయులకు ఆయన తన వంతు సాయం చేశారు. ప్రభుత్వాలు పట్టించుకోని సమయంలో తమకు అండగా నిలిచిన గౌరీ సతీష్ కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇస్తామని ప్రైవేటు ఉపాధ్యాయులు, లెక్చరర్లు బహిరంగంగానే చెబుతున్నారు.

మరోవైపు పట్టభద్రుల్లో అధికార, విపక్ష పార్టీలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో టీఆర్ఎస్ అంటేనే మండిపోతున్నారు నిరుద్యోగులు. టీఆర్ఎస్ నేతలు ప్రచారం కూడా చేయలేకపోతున్నారని తెలుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు కూడా కష్టకాలంలో  తమకు సపోర్ట్ చేయలేదనే భావనలో ఉన్నారు నిరుద్యోగులు. సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న రామచంద్రరావు తమను పట్టించుకోలేదని, మండలిలో ఏనాడు తమ సమస్యలపై మాట్లాడలేదని వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ఎలాగూ గెలవలేదనే అభిప్రాయంతో ఆ పార్టీ అభ్యర్థికి ఓటు వేయడానికి పట్టభద్రులు ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు.

మొత్తంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఆలోచనా తీరులో క్లారిటీ ఉందనే చర్చ జరుగుతోంది. పదవులు వచ్చాకా తమను మర్చిపోయే పార్టీల నేతల  కంటే.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామంటూ వస్తున్న గౌరీ సతీష్ లాంటి వాళ్లను గెలిపిస్తేనే తమకు మంచి జరుగుతుందనే నిర్ణయానికి పట్టభద్రులు వచ్చారని తెలుస్తోంది. అందుకే గౌరీ సతీష్ కు వస్తున్న మద్దతు చూసి.. హైదరాబాద్ స్థానం నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు.. టెన్షన్ పడుతున్నారని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: