ఏపీలో న‌గ‌ర‌పాల‌క సంస్థ‌లు, పుర‌పాల‌క సంఘాల‌కు ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసింది. 10వ తేదీన అభ్య‌ర్థుల త‌ల‌రాత‌ల‌ను ప‌ట్ట‌ణ ఓట‌ర్లు నిర్ణ‌యించ‌నున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన ప్ర‌చారాన్ని ఒక‌సారి ప‌రిశీలిస్తే గ‌తంలో కంటే భిన్నంగా తెలుగుదేశం పార్టీ త‌న దూకుడును పెంచింది. మాట‌లను తూటాల్లా వాడింది. వాడి వేడి ప‌ద‌జాలం ఉప‌యోగిస్తూ ప్ర‌త్య‌ర్థుల‌ను ఉక్కిరిబిక్కిరి చేశారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన త‌ర్వాత ఈ స్థాయిలో ప్ర‌త్య‌ర్థుల‌పై వాగ్బాణాల‌ను సంధించిన దాఖ‌లాలు లేవు. ఈ మార్పు ఆ పార్టీకి ఎంత‌వ‌ర‌కు ఉప‌యోగ‌ప‌డుతుందో ఫ‌లితాలొచ్చిన త‌ర్వాతే తెలుస్తుంది. అప్ప‌టివ‌ర‌కు వేచిచూడాల్సిందే!!.

పేలిన మాట‌ల తూటాలు
హిందూపురం మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న నంద‌మూరి బాలకృష్ణ సైతం మాటల తూటాలను పేలుస్తూ ఎన్నికల వేడి రాజేస్తున్నారు . చివ‌రిరోజు ఎన్నిక‌ల ప్ర‌చారంలో బాల‌య్య హిందూపురంలోని ఇందిరమ్మ కాలనీ, చౌడేశ్వరి కాలనీ ,కొర్లగుంట తదితర ప్రాంతాల్లో ప్ర‌చారం నిర్వ‌హించారు. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని త‌న ఇంట్లో కేక్ కట్ చేసిన బాలయ్య స్థానిక మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మ‌హిళ‌లు శ‌క్తికి ప్ర‌తీక‌ల‌ని, వారికి సాటివ‌చ్చే శ‌క్తి ఏదీలేద‌న్నారు.

మీ జేబులో డ‌బ్బుల‌తో ఏమ‌న్నా ఖ‌ర్చుచేస్తున్నారా?
అనంత‌రం ప్ర‌చారంలో బాలకృష్ణ వైసీపీ నేతలపై మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే సంక్షేమ పథకాలు కట్ చేస్తామని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని, ఎవరైనా బెదిరిస్తే నిలదీయాలంటూ పిలుపునిచ్చారు. ప్రజలు చెల్లించే పన్నులతోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నార‌ని, వీటి అమ‌లుకు వైసీపీ నేతలు జేబుల్లో డబ్బులు ఖర్చు చేయడం లేదంటూ ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలంటూ ప్ర‌జ‌లు వైసీపీ నేత‌ల‌ను నిల‌దీయాల‌ని కోరారు.  చివ‌రిరోజు కావడంతో హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో ప్రచారాన్ని బాల‌య్య హోరెత్తించారు. ఈసారి బాలయ్య రంగంలోకి దిగి సాగించిన ఎన్నికల ప్రచారంతో హిందూపురం పుర‌పాల‌క సంస్థ‌ను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుందా?  వైసీపీ గెలుచుకుంటుందా?  అనేది వేచిచూడాల్సిందే!!.


మరింత సమాచారం తెలుసుకోండి: