అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల పంచాయితీ ముగిసింది. ఎట్టకేలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు, ప్రభుత్వానికి జరిగిన వివాదంలో ఎస్‌ఈసీనే గెలిచారు. దీంతో ఈ రోజు ఎన్నికల నోటిఫికేషన్‌ను ఆయన అధికారికంగా విడుదల చేశారు. విజయవాడలోని ఎస్‌ఈసీ కార్యాలయంలో ఈ రోజు(శనివారం) ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తొలివిడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ విడుదల చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి ముందుకెళ్తున్నట్టు రమేశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు నాలుగు దశల్లో నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. విజయనగరం, ప్రకాశం జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో ఎన్నికలు ఉంటాయని, ఆ తరువాత మిగిలిన జిల్లాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు.

ఎన్నికల వల్ల స్థానిక నాయకత్వం బలోపేతం అవుతుందని ఎస్‌ఈసీ అన్నారు. విధులు, నిధులు, అధికారాలు ఎన్నికల వల్లే సాధ్యమని, ఏకగ్రీవ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని చెప్పారు. ఐజీ స్థాయి అధికారులతో ఏకగ్రీవాలపై దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. ఎన్నికల సంఘానికి నిధులు, సిబ్బంది కొరత వంటి సమస్యలు ఉన్నాయని,  ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లినా పరిష్కారం లభించలేదని, అందుకే కోర్టుకెక్కాల్సి వచ్చిందని చెప్పారు. కోర్టు చెప్పినా ప్రభుత్వం నుంచి సరైన స్పందన కనిపించలేదని, ప్రభుత్వ ఉదాసీనతను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.

పంచాయతీ ఎన్నికలు చరిత్రాత్మకమని, ఎన్నికల సక్రమ నిర్వహణకు ప్రభుత్వం సహకరించాలని నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ కోరారు. ప్రస్తుతం కమిషన్‌లో కొంతమందే ఉన్నా సమర్థంగా పనిచేస్తున్నారని, సిబ్బంది కొరత వల్ల కమిషన్‌ పనితీరులో అలసత్వం ప్రదర్శించమని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల నిర్వహణ కమిషన్‌కు అతి పెద్ద సవాల్ అని, ఉద్యోగ సంఘాలు భిన్న వాదనలు వినిపిస్తున్నాయని, దేశమంతటా ఎన్నికలు జరుగుతున్నా ఏపీలో వద్దనడం సరికాదని, ఉద్యోగులు ప్రజాసేవకులని, వారు తమ ధర్మాన్ని విస్మరిస్తే విపత్కర పరిస్థితులు తప్పవని హెచ్చరించారు. అయితే దీనిపై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పునిచ్చినా పాటించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎస్‌ఈసీ స్పష్టం చేశారు. అంతేకాదు ఈ ఎన్నికలు రెవెన్యూ డివిజన్‌ ప్రాతిపదికగానే జరుగుతాయని వెల్లడించారు.

తొలి దశ ఎన్నికల ప్రక్రియ ఎలా కొనసాగుతుందంటే..
మొదటి దశ ఎన్నికల ప్రక్రియ శనివారమే ప్రారంభమై ఫిబ్రవరి 5న సర్పంచి, ఉపసర్పంచి ఎన్నికలతో ముగుస్తుంది.
జనవరి 23: నోటిఫికేషన్‌ జారీ
జనవరి  25: అభ్యర్థులనుంచి నామినేషన్ల స్వీకరణ
జనవరి  27: నామినేషన్ల దాఖలుకు తుది గడువు
జనవరి  28: నామినేషన్ల పరిశీలన
జనవరి  29: నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన
జనవరి  30: ఈ అభ్యంతరాలపై తుది నిర్ణయం
జనవరి  31: నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు (మధ్యాహ్నం 3 గంటల వరకు).. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల
ఫిబ్రవరి 5: పోలింగ్‌ తేదీ (సర్పంచి ఎన్నిక కోసం ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 మధ్య పోలింగ్‌)

పోలింగ్‌ ప్రక్రియ పూర్తయిన తరువాత మధ్యాహ్నం 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆ వెంటనే ఫలితాలను అధికారులు వెల్లడిస్తారు. దీని తర్వాత ఉపసర్పంచి ఎన్నికను పూర్తి చేయటంతో మొదటి విడత ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: