ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీ హవా ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి జిల్లాలోనూ వైసీపీ వేవ్ ఉందని ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు రుజువు చేశాయి. అయితే ఇంత భారీ ఆధిక్యంలో ఉన్న వైసీపీని దెబ్బకొట్టడం చాలా కష్టమైపోతుంది. 2019 ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్‌ హవా తగ్గించడం, చంద్రబాబు వల్ల కావడం లేదు. జగన్ సీఎం పీఠంలో కూర్చున్న దగ్గర నుంచి బాబు గట్టిగానే వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అలాగే రాజకీయంగా ప్రతి అంశంలోనూ పోరాడుతున్నారు.


అయితే ఎంత పోరాడినా ప్రజలు మాత్రం జగన్ వైపే నిలుస్తున్నారు. ప్రజలు వైసీపీకి అనుకూలంగానే తీర్పు ఇస్తున్నారు. అయినా సరే బాబు వదలకుండా టీడీపీని బలోపేతం చేయడానికి కష్టపడుతున్నారు. కానీ ఈ విషయంలో వ్యూహాత్మకంగా ముందుకెళితే లబ్ది చేకూరే అవకాశం ఉంటుంది. బాబు మొదట టీడీపీ త్వరగా బలం పుంజుకునే నియోజకవర్గాల మీద దృష్టి పెడితే బాగుంటుందని సొంత పార్టీలోనే చర్చలు నడుస్తున్నాయి.


పలు నియోజకవర్గాల్లో నాయకులని యాక్టివ్ చేస్తే మరింత మేలు జరిగే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో  పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేస్తే బాగుంటుందని తెలుస్తోంది. మామూలుగానే భీమిలి టీడీపీకి కంచుకోట. ఇక్కడ ఎక్కువసార్లు టీడీపీనే గెలిచింది. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన అవంతి శ్రీనివాస్ గెలిచారు. చివరి నిమిషంలో టీడీపీ టిక్కెట్ దక్కించుకున్న సబ్బం హరి ఓటమి పాలయ్యారు. అయితే అంత జగన్ వేవ్‌లో ఇక్కడ అవంతికి 9 వేల మెజారిటీనే వచ్చింది.


ఇక అవంతి గెలిచి మంత్రి అయ్యి, నియోజకవర్గంపై మరింత పట్టు సాధించుకునే దిశగా పనిచేస్తున్నారు. కానీ ఓడిపోయిన సబ్బం హరి నియోజకవర్గంలో కనిపించడం లేదు. ఆయన విశాఖలో ఉంటూ, టీవీ డిబేట్లలో మాత్రమే కనిపిస్తున్నారు. దీంతో భీమిలిలో మంచి నాయకుడుని పెట్టాలని తమ్ముళ్ళు కోరుతున్నారు. పైగా ఇటీవల జరిగిన విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో భీమిలి పరిధిలో ఉన్న డివిజన్లలో టీడీపీ సత్తా చాటింది. ఇక్కడున్న 9 డివిజన్లలో టీడీపీ 5 గెలిస్తే, వైసీపీ 4 గెలుచుకుంది. దీని బట్టి చూసుకుంటే భవిష్యత్‌లో భీమిలిలో టీడీపీకి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ సరైన నాయకుడుని సెట్ చేస్తే తిరుగుండదు.


మరింత సమాచారం తెలుసుకోండి: