ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నారు. తిరుపతి పార్లమెంట్‌ ఓటర్లకు జగన్‌ బహిరంగ లేఖ రాశారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్నందున రాలేకపోతున్నానని. చిత్తూరు జిల్లాలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయని జగన్ తెలిపారు. మీరంతా నా వాళ్లే.. నేను సభకు హాజరైతే వేలాది మంది వస్తారు. మళ్లీ కోవిడ్‌ కేసులు పెరిగే ప్రమాదం ఉంది అని జగన్ లేఖలో తెలిపారు

జగన్ తిరుపతి పర్యటన రద్దు కావడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. నిజంగా కరోనా కేసులే కారణమా? వారం క్రితమూ కొంచెం అటూఇటూగా ఇన్నే కేసులు ఉన్నాయి. అయినా, పర్యటన వాయిదా వేసుకోలేదు.ఇటీవలే పరిషత్ ఎన్నికలు జరిగాయి. వైసీపీ నేతలంతా జోరుగా ప్రచారం చేశారు. అప్పడు లేని సమస్య ఇప్పుడే వచ్చిందా అన్న చర్చ జరుగుతోంది. ఓటమి భయమే జగన్‌ను తిరుపతి వచ్చేలా టెంప్ట్ చేసిందని.. ఇప్పుడు అదే ఓటమి భయం సీఎంను తిరుపతి టూర్‌కు డుమ్మా కొట్టేలా చేసిందని అంటున్నారు.

ఇంటెలిజెన్స్ సర్వేలో వైసీపీ కేండిడేట్ గురుమూర్తికి గెలుపు అవకాశాలు తక్కువేనంటూ నివేదికలు వచ్చాయంటూ ప్రచారం జరిగింది. తనకు పాదసేవ చేశాడనే ఏకైక కారణంతో ప్రజలకు పెద్దగా పరిచయంలేని ఫిజియోథెరపిస్టు గురుమూర్తిని పోటీలో నిలపడంపై ఓటర్లు పెదవి విరిచారు. ఓవైపు టీడీపీ ఎన్నికల ప్రచారంలో దుమ్ము రేపుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌లు తిరుపతిలోనే మకాం వేసి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. చంద్రబాబు, లోకేశ్‌లకు తిరుపతిలో అడుగడుగునా ప్రజలు నుంచి విశేష స్పందన వస్తోంది. దీంతో గురుమూర్తి గెలుపు కష్టసాధ్యం కావడంతో జగన్ పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది. ఒకవేళ తాను ప్రచారం నిర్వహించినా వైసీపీ అభ్యర్థి ఓడిపోతే తన పరువు పాతాళానికి పడిపోతుందని భయపడుతున్నారట. అందుకే, ఎందుకైనా మంచిదని తిరుపతి ప్రచారం విషయంలో పునరాలోచనలో పడ్డారని చెబుతున్నారు. కరోనా కేసులను సాకుగా చూపి.. తిరుపతికి రాలేనంటూ లేఖ రాసి చేతులు దులిపేసుకున్నారని భావిస్తున్నారు.

తిరుపతిలో ప్రచారం చేసిన టీడీపీ నేత పరిటాల శ్రీరాం.  సీఎం జగన్‌పై మండిపడ్డారు. ఓడిపోతామని తెలిసే జగన్‌ ప్రచారానికి రాలేదని ఎద్దేవాచేశారు. టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేశ్ పర్యటనలకు అద్భుతమైన స్పందన వస్తోందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వాన్ని కాలరాయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, టీడీపీకి మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారని పరిటాల శ్రీరాం స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: