దేశంలో కరోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో లాక్‌డౌన్ విధిస్తార‌న్న చ‌ర్చ జోరుగా న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. దూర ప్రాంత ప్ర‌జ‌లు వినియోగించే రైలు ర‌వాణా కూడా నిలిచిపోతుంద‌న్న వాద‌న సాగుతుండ‌టంతో రైల్వే బోర్డు అధికారులు దీనిపై స్ప‌ష్ట‌త ఇచ్చారు. రైళ్లు ఆపే ఉద్దేశం లేదని రైల్వేబోర్డు చైర్మన్ సునీత్ శర్మ స్పష్టం చేశారు. దేశంలో అన్ని గమ్యస్థానాలకూ తగిన సంఖ్యలో సర్వీసులను నడపడానికి అనువుగా రైళ్లను సిద్ధంగా ఉంచినట్టు చెప్పారు. ఎక్కడా కొరత లేదన్నారు. డిమాండ్ ఉన్న మార్గాల్లో అదనంగా రైళ్లు నడపడానికి డివిజన్ రైల్వే మేనేజర్లకు అధికారాలు ఇచ్చినట్టు వెల్లడించారు. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి నెగిటివ్ రిపోర్ట్ అవసరం లేదని రాబోయే రోజుల్లో ఆలోచిస్తామన్నారు.


ఇదిలా ఉండ‌గా దేశంలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 11,73,219 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..1,45,384 మందికి పాజిటివ్‌గా తేలింది. తాజాగా 794 మరణాలు సంభవించాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,32,05,926 చేరగా.. 1,68,436 మంది ప్రాణాలు కోల్పోయారని శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక క్రియాశీల కేసులు భారీగా పెరిగాయి. నిన్నటికి 10,46,631మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో క్రియాశీల కేసుల వాటా 8 శాతానికి చేరువైంది. మరోవైపు రికవరీ రేటు 90.8శాతానికి పడిపోయింది.


 అయితే, నిన్న ఒక్కరోజే 77,567 మంది కోలుకోవడం సానుకూల పరిణామం. ప్రస్తుతం వైరస్‌ను జయించిన వారి సంఖ్య కోటీ 20లక్షలకు చేరువైంది.ఇక మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఓ పక్క కరోనా మహమ్మారి విజృంభిస్తుండగా మరోపక్క కరోనాను ఎదుర్కొనేందుకు ఇస్తున్న వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లి మరిన్ని డోసులు కావాలని అడిగింది. అయితే, మహారాష్ట్రలో కరోనా వ్యాక్సిన్ల కొరత ఏర్పడినట్లే.. పంజాబ్‌, రాజస్థాన్‌లోనూ కొరత ఏర్పడింది. కేవలం ఐదు రోజులకు మాత్రమే సరిపడా టీకాలు మిగిలి ఉన్నాయని పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: