తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ప్రచారంలో వకీల్ సాబ్ సినిమా కీలక అంశంగా మారింది. వకీల్ సాబ్ సినిమా బెనిఫిట్ షోలు రద్దు చేస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై రాజకీయ రచ్చ జరుగుతోంది. వైసీపీ సర్కార్ పై విపక్షాలన్ని విరుచుకుపడుతున్నాయి. మాములుగా పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుంటే.. బెనిఫిట్ షోలు, అదనపు షోలతో పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఉంది. గతంలో చాలా సినిమాలకు ఈ అవకాశం వచ్చింది. కాని పవన్ కల్యాణ్ వకీల్ సాబ్‌ పై కక్ష కట్టిన జగన్ సర్కార్.. బెనిఫిట్ షోలు రద్దు చేసింది.గత నెలలో విడుదలైన ఉప్పెన సినిమాకు కూడా టికెట్ రేట్లు పెంచారు. ఇప్పుడు వకీల్ సాబ్ కు మాత్రం జగన్ సర్కార్ ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు.

జగన్ సర్కార్ తీరును ఎండగడుతూ పవన్ కల్యాణ్ కు అండగా నిలిచారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పవన్ కల్యాణ్ సినిమాని అడ్డుకుంటారా? అని, హైకోర్టు అనుమతి ఇస్తే హౌస్ పొజిషన్‌కి వెళతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ మీద అభిమానంతో తాను మాట్లాడటం లేదని, ధర్మం, న్యాయం కోసం అడుగుతున్నానన్నారు. సూళ్లూరు‌పేట రోడ్ షోలో ప్రసంగించిన చంద్రబాబు..  జగన్ రెడ్డికి భయపడితే ఇంట్లో నుంచి కూడా రానని చెప్పారు.

వకీల్ సాబ్ సినిమా కోసం పవన్ కల్యాణ్ కు మద్దతుగా చంద్రబాబు కామెంట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అది కూడా ఎన్నికల సభలో మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థికి మద్దతుగా చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. పవన్ కూడా తమ పొత్తుతో పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థి కోసం ప్రచారం చేశారు. అయినా పవన్ కల్యాణ్ కు మద్దతుగా ఎన్నికల సభలోనే చంద్రబాబు మాట్లాడటంతో కొత్త చర్చ తెరపైకి వస్తోంది. భవిష్యత్ లో టీడీపీ, జనసేన కలిసిపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అందులో భాగంగానే పవన్ ను మద్దతుగా చంద్రబాబు ఓపెన్ గానే కామెంట్ చేశారని చెబుతున్నారు. బీజేపీతో అయిష్టంగానే పవన్ కల్యాణ్ కలిసి పనిచేస్తున్నారనే చర్చ కొంత కాలంగా సాగుతోంది. తిరుపతి ఉప ఎన్నిక తర్వాత బీజేపీకి జనసేన గుడ్ బై చెప్పేస్తుందనే చర్చ కూడా ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కు మద్దతుగా చంద్రబాబు మాట్లాడటంతో.. బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: