ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి ఎంపీగా ఉన్న బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. సాధారణంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. కానీ తిరుపతిలో తమకు పట్టు ఉందని సీటు కేటాయిస్తే గెలుస్తామని ముందు నుంచి గట్టిగా బీజేపీ జనసేన రెండు పార్టీలు ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి. చివరికి జాతీయ స్థాయి ఒత్తిడితో పవన్ కళ్యాణ్ పక్కకు తప్పుకొని బిజెపికి సీటు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అయితే ఎంతో కష్టపడి ఆ సీటు సాధించిన బిజెపి వైసీపీని ఎటాక్ చేయడంలో మాత్రం వెనుకబడి పోయింది అనే చెప్పాలి.

 ఆంధ్రప్రదేశ్ విషయం అనే కాక బీజేపీ విషయం చూస్తే దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇప్పుడు మతసంబంధ రాజకీయాలు చేస్తున్నారని అపవాదు ఉంది. దానిని ఆంధ్రప్రదేశ్ లో కూడా బీజేపీ వదలడం లేదు. జగన్ ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఎత్తిచూపి ఓట్లు అడగాల్సింది పోయి, జగన్ క్రైస్తవులు కాబట్టి మరో క్రైస్తవుడికి సీట్ ఇచ్చాడని తిరుపతి ఆధ్యాత్మిక పట్టణం కాబట్టి తమకు ఓటు వేయాలని బీజేపీ వాదిస్తోంది. తమ అభ్యర్థిని గెలిపిస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తాము అనే అంశాన్ని ప్రచారం చేయకుండా ఎంతసేపూ మతపరమైన ఆరోపణలు చేస్తూ తిరుపతి ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా అసహనం కలిగిస్తున్న మాట వాస్తవం. 

ఎన్నికలకు ఇంకా సరిగ్గా మూడు రోజులు కూడా లేదు అయినా సరే వీరి ధోరణిలో మాత్రం ఏ మాత్రం మార్పు లేదు. నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తిరుపతి ప్రచారానికి వచ్చి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కానీ తిరుపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న గురుమూర్తి మాత్రం ఇప్పటిదాకా తిరుమల కొండ మీదకి కూడా ఎక్క లేదని ఆరోపించారు. వాస్తవానికి అన్ని పార్టీల అభ్యర్థులు తాము తాము నమ్మే దేవుడి దగ్గరకు నామినేషన్ వేసే ముందు వెళ్తారు. 

గురుమూర్తి కూడా తాను హిందువునని తాను నామినేషన్ వేయడానికి ముందు తమ ఊరిలో ఉన్న గ్రామదేవతకు మొక్కులు చెల్లించుకున్నా అని కొన్ని ఆధారాలు విడుదల చేశారు. కానీ బీజేపీ వాదన ఎలా ఉంది అంటే వెంకన్నను మొక్క లేదు కాబట్టి ఆయన హిందువు కాదు ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలి అన్నట్లు వింత ధోరణి ప్రదర్శిస్తోంది.. అదేదో సినిమాలో మూసుకు కోర్చోరా ఎవరో పూల చొక్కా అంటే లెక్చరర్ వచ్చి అపాలజీ చెప్పాలి అంటాడు సునీల్. అదే విధంగా గురుమూర్తి తిరుపతి వెంకన్నను దర్శించుకోలేదు కాబట్టి జగన్ బీజేపీకి క్షమాపణ చెప్పాలి అనడం బిజెపి నేతలకే చెల్లింది.

మరింత సమాచారం తెలుసుకోండి: