దేశంలో కరోనా మహమ్మారి విలయం స్పష్టించబోతుందా? కరోనా లక్షలాది మందిని బలి తీసుకోనుందా? అంటే నిపుణుల నుంచి అవుననే సమాధానమే  వస్తోంది. కొన్ని రోజులుగా నమోదవుతున్న కేసులతో దేశంలో రెండోవిడత కరోనా ఉద్ధృతి మరింత ప్రమాదకరంగా మారనుందని చెబుతున్నారు. రోజువారీ కొత్త కేసులు 3 లక్షల వరకు నమోదు కానున్నాయని భావిస్తున్నారు. దేశంలో కరోనా ఉద్ధృతి మరో 45 రోజులు కొనసాగనుందని అంచనా వేస్తున్నారు.

దేశవ్యాప్తంగా రెండో విడత కరోనా ప్రకంపనలు మే చివరి వరకూ కొనసాగే ప్రమాదమున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం బుధవారం దేశవ్యాప్తంగా 2,00,739 కొత్త కేసులతో అత్యధిక గరిష్ఠస్థాయి నమోదైంది. ఈ కేసులతో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 1.40 కోట్లు దాటింది. తొలిసారి రోజువారీ మరణాలు కూడా అత్యధికంగా నమోదయ్యాయి. 1,038 మరణాలతో మొత్తం సంఖ్య 1,73,123కు పెరిగింది.కొవిడ్‌ కేసుల వృద్ధి రేటుపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా తర్వాత ఈ స్థాయిలో రోజువారీ కేసులు నమోదు కావటం భారత్‌లో మాత్రమేనని అంటున్నారు.


ఏడు శాతంగా ఉన్న యాక్టివ్‌ కేసుల వృద్ధిరేటు ఇలాగే కొనసాగితే.. రోజువారీ కేసుల సంఖ్య 3 లక్షలకు చేరుతుందని హెచ్చరిస్తున్నారు. అమెరికాలో జనవరి 8న రోజువారీ కేసులు 3లక్షల 9వేలు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే అత్యధికం. అయితే భారత్‌లో ప్రస్తుతం రోజువారీ కేసులు 2 లక్షలకు చేరువయ్యాయి. అమెరికాలో రోజుకు లక్ష కేసుల నుంచి రెండు లక్షల కేసులకు చేరడానికి 22 రోజులు పడితే.. ఇండియాలో మాత్రం కేవలం 11 రోజులే పట్టింది.

కరోనావ్యాప్తి ఇలాగే కొనసాగితే భారత్ అమెరికా గరిష్ఠ స్థాయిని అధిగమించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.కరోనా వైరస్‌ కొత్త మ్యూటెంట్‌ స్ట్రెయిన్లు ప్రమాదకరంగా మారాయి. కొత్తమ్యూటెంట్ల వల్ల వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు పేర్కొంటున్న నిపుణులు.. మరణాల సంఖ్య తక్కువగా ఉంటుందని చెప్పటానికి ఆధారాల్లేవన్నారు. టీకా పంపిణీ ప్రారంభంలోనే వ్యాక్సిన్‌ తీసుకోకపోవటమే ప్రస్తుత పరిస్థితికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికైనా తప్పకుండా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ, భయాలు లేకుండా టీకా తీసుకుంటే మహమ్మారి ముప్పు నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: