తెలంగాణ‌లో కొత్త‌పార్టీని పెట్టేందుకు సిద్ధ‌మైన వై.ఎస్‌. ష‌ర్మిల‌.. పార్టీ పేరును ప్ర‌క‌టించ‌క ముందే ప్ర‌జ‌ల్లోకి దూకుడుగా వెళ్తున్నారు. తెరాస ప్ర‌భుత్వ‌మే టార్గెట్‌గా విమ‌ర్శ‌లు గుప్పిస్తూ త‌న బ‌లాన్ని పెంచుకొనేందుకు వ్యూహాత్మ‌కంగా ముందుకుసాగుతున్నారు. ఈ క్ర‌మంలో రాష్ట్రంలో యువ‌త‌కు ఉద్యోగాలు క‌ల్పించాల‌ని డిమాండ్ చేస్తూ వైఎస్ ష‌ర్మిల మూడు రోజుల దీక్ష‌కు సిద్ధ‌మ‌య్యారు. కానీ పోలీసులు ఒక్క‌రోజు దీక్ష‌కే అనుమ‌తి ఇవ్వ‌డంతో హైద‌రాబాద్‌లోని ఇందిరాపార్క్ వ‌ద్ద ష‌ర్మిల గురువారం దీక్ష‌కు దిగారు. ఈ దీక్ష‌లో ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. ష‌ర్మిల మాట్లాడుతుండ‌గా.. ప‌లు మీడియా సంస్థ‌ల‌కు చెందిన కెమెరామెన్‌లు కెమెరాల‌ను అడ్డుగా ఉంచ‌డంతో.. తొల‌గించ‌మంటూ ష‌ర్మిల విజ్ఞ‌ప్తి చేశారు. ఈ క్ర‌మంలో అక్క‌డే ఉన్న సాక్షి మీడియాపై ఆమె సెటైర్లు వేయ‌డం అక్క‌డివారిని ఒక్క‌సారిగా అవాక్క‌య్యేలా చేసింది.

సాక్షి ఛానెల్‌కు చెందిన కెమెరామెన్‌ను ప‌క్క‌కు త‌ప్పుకోవాల‌ని సూచించిన ష‌ర్మిల‌.. అంత‌టితో ఆగ‌కుండా మీరు క‌వ‌రేజ్ చేసింది చాల్లేమా... ఎలాగో సాక్షి మాకు క‌వ‌రేజ్ ఇవ్వ‌దుగా అంటూ ఫైర్ అయ్యారు. ప‌క్క‌నే ఉన్న ష‌ర్మిల త‌ల్లి విజ‌య‌మ్మ ఒక్క‌సారిగా కంగుతిని ష‌ర్మిల‌ను చేత్తోత‌ట్టారు. అయినా ష‌ర్మిల త‌న‌దైన శైలిలో సాక్షి మీడియాపై సెటైర్లు వేశారు. తెలంగాణ‌లో ష‌ర్మిల పార్టీ పెట్ట‌డం ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి ఇష్టం లేద‌ని మొద‌టి నుంచి ప్ర‌చారం సాగుతుంది. వైసీపీ ముఖ్య‌నేత స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిసైతం ఇదే విష‌యాన్ని మీడియా ముఖంగా స్ప‌ష్టం చేశారు. తెలంగాణ‌లో వైఎస్ ష‌ర్మిల పార్టీతో మాకు సంబంధం లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. అయినా ష‌ర్మిల‌, జ‌గ‌న్ ఒక్క‌టే అని, కేవ‌లం బ‌హిరంగంగానే అలా ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారంటూ ప్ర‌చారం సాగుతుంది.

తాజా ప‌రిణామంతో అన్న జ‌గ‌న్ కు ష‌ర్మిల‌కు గ్యాప్ ఎక్కువ‌గానే ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతుంది. సాక్షి మీడియా జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిది. ష‌ర్మిల పార్టీ ఏర్పాటు ప్ర‌క్రియ నుంచి సాక్షి మీడియా ఆశించిన స్థాయిలో కాక‌పోయిన క‌వ‌రేజ్ ఇస్తూనే వ‌స్తుంది. తెలంగాణ‌లో అధిక‌శాతం కేసీఆర్‌, తెరాస ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల క‌వ‌రేజ్‌కే సాక్షి ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇదే క్ర‌మంలో ష‌ర్మిల తెరాస ప్ర‌భుత్వం, కేసీఆర్ కుటుంబంపైనా తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో సాక్షి త‌మ‌కు ఆశించిన ప్రాధాన్య‌త ఇవ్వ‌టం లేద‌న్న భావ‌న ష‌ర్మిల అనుచ‌రుల్లో వ్య‌క్త‌మ‌వుతుంది. ఈవిష‌యంలో సాక్షిపై గుర్రుగా ఉన్న ష‌ర్మిల‌.. త‌న ఆగ్ర‌హాన్ని దీక్షాస్థ‌లి వేదిక‌గా వెల్ల‌గ‌క్క‌డం గ‌మ‌నార్హం. అయితే అన్న వై.ఎస్‌.జ‌గ‌న్, వ‌దిన భార‌తితో ష‌ర్మిల‌కు విబేధాలు ఉన్న‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. ఈ క్ర‌మంలోనే తాను పెట్ట‌బోయే కొత్త‌పార్టీ కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌చారాన్ని క‌ల్పించేందుకు సాక్షిని న‌మ్ముకొనే బ‌దులు తాను సొంతంగా ఓ పేప‌ర్‌, ఛానెల్ పెట్టేందుకుసైతం ష‌ర్మిల సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: