ఎవ‌రు అవున‌న్నా కాద‌న్నా తెలంగాణ రాష్ట్రం సాకారం కావ‌డంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీదే ప్ర‌ధాన పాత్ర. టీఆర్ఎస్ పాత్ర‌ను, కేసీఆర్ పోరాట స్పూర్తిని త‌క్కువ చేయ‌లేం కాని, నాడు సోనియా రాజ‌కీయంగా పార్టీకి న‌ష్ట‌మ‌ని తెలిసినా.. విభ‌జ‌న‌కు సానుకూలంగా గ‌ట్టిగా నిల‌బ‌డ‌క‌పోయి ఉంటే ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డి ఉండేది కాదు. అయితే తెలంగాణ ఇచ్చి కూడా ఆ ఘ‌న‌త‌ను ప్ర‌జ‌ల్లో స‌మ‌ర్థంగా చాటుకోలేక రాజ‌కీయంగా రాష్ట్రంలో  తీవ్ర స‌వాళ్ల‌ను ఎదుర్కొంటున్న దుస్థితి ఆ పార్టీది. ప్ర‌స్తుతం  కాంగ్రెస్‌ పార్టీ ముందున్న అతిపెద్ద సవాలు నాగార్జున సాగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక. వ‌రుస ఓట‌ముల‌తో పాటు, మ‌రోప‌క్క బీజేపీ రాష్ట్రంలో బ‌ల‌ప‌డేందుకు దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్న నేప‌థ్యంలో‌ తెలంగాణలో కాంగ్రెస్‌ పనైపోయిందనే ప్రచారానికి అడ్డుక‌ట్ట వేయాలంటే సాగ‌ర్ ఉప ఎన్నిక‌లో ఆ పార్టీ గెలిచితీరాల్సిన ఆగ‌త్యం ఏర్ప‌డింది.
 
నాగార్జున సాగర్‌‍లో అటు అధికార టీఆర్ఎస్‌‌, ఇటు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం రెండూ బలంగా ఉన్నాయి. మ‌రోప‌క్క హిందుత్వ అజెండాతో పాటు యువత మద్దతుతో బలపడేందుకు బీజేపీ కూడా వ్యూహాలు ప‌న్నుతోంది. వాస్తవానికి 2018 ఎన్నికల్లో జానారెడ్డి ఏడు వేల పైచిలుకు ఓట్లతో ఓడిపోయారు. యాదవ సామాజిక ఓటర్ల మద్దతుతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల నర్సింహయ్య యాదవ్‌ నాటి ఎన్నికల్లో గెలుపొందారు. ఆ ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్యర్థి రెండు శాతం క‌న్నా త‌క్కువ ఓట్లు మాత్రమే వ‌చ్చాయి. ఆ తరువాత 2019 ఏప్రిల్‌‍లో జరిగిన లోక్‌‍సభ ఎన్నికల్లో ప‌రిస్థితి మారింది. కాంగ్రెస్‌‍కు ఈ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో మూడు వేల మెజారిటీ వ‌చ్చింది. ఆ వెనువెంట‌నే జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నికల్లో టీఆర్ ఎస్‌కు పోటాపోటీగా ఓట్లు సాధించి గ‌ట్టి స‌వాల్‌నే విసిరింది.

గత ఏడాది డిసెంబరులో టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అనారోగ్యంతో మరణించడంతో ఇక్క‌డ అసెంబ్లీ ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ ప్రాంతానికి ఒరిగిందేమీ లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన తనయుడు కేటీఆర్‌‌తో సహా తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు పదేపదే ప్రచారం చేస్తున్నారు. అయితే నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో మాత్రం జానారెడ్డి హయాంలోనే ఎక్కువ అభివృద్ధి జరిగిందనే చర్చ మొదలైంది. ఇందుకు కార‌ణాలున్నాయి. తెలంగాణలో భారీ ప్రాజెక్టులు నాగార్జున సాగర్‌, శ్రీశైలం, పోచంపాడు, ఎస్సార్సీపీ వంటివ‌న్నీకాంగ్రెస్‌ హయాంలో నిర్మించినవే. వీటి కార‌ణంగానే  లక్షలాది ఎకరాలు ప‌చ్చ‌ని పంట‌ల‌తో కళకళలాడుతున్నాయి. సాగర్‌ నియోజకవర్గంలోనే దాదాపు 2 లక్షల ఎకరాలకు సాగు నీరందించిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేన‌ని చెప్పాలి. మ‌రోప‌క్క టీఆర్ ఎస్ హ‌యాంలో మొద‌లుపెట్టిన సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి జ‌రిగింద‌నే ఆరోప‌ణ‌లున్నాయి.ఈ నేప‌థ్యంలో తెలంగాణ ఇస్తే పార్టీని విలీనం చేస్తానని, దళితుడినే తెలంగాణ తొలి సీఎం చేస్తానని అప్ప‌ట్లో గ‌ట్టిగా చెప్పిన కేసీఆర్  మాట‌ల‌ను కాంగ్రెస్ నేత‌లు ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళుతున్నారు. సీఎల్పీ లీడర్‌ మల్లు భట్టి విక్రమార్క ఇటీవ‌ల‌ చేపట్టిన రైతులతో ముఖాముఖి యాత్ర, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి చేపట్టిన పాద యాత్ర పార్టీ క్యాడ‌ర్‌లో మంచి జోష్‌ను తెచ్చాయ‌నే చెప్పాలి. సాగ‌ర్‌లో జానారెడ్డి గెలుపుతో కాంగ్రెస్‌‍కు పున‌ర్వైభ‌వం తేవాల‌ని, టీఆర్‌ఎస్‌‍కు అసలు సిసలైన ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే తప్ప బీజేపీ కాదనే సంకేతాలను తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు పంపాలని ఆ పార్టీ ప్ర‌స్తుతం స‌ర్వ‌శక్తుల‌నూ ఒడ్డుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: