‘దొంగ ఓటర్లను, వాహనాలను తెలుగుదేశంపార్టీ శ్రేణులు పట్టుకుంటే ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. తండ్రి పేరు చెప్పలేని వాళ్లు దొంగ ఓటర్లు కాక మరేంటి..?. మంత్రి పెద్దిరెడ్డికి చెందిన పీఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో వేలాదిమందిని పెడితే పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారంటూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ప్ర‌శ్నించారు. ఇన్ని సంఘ‌ట‌న‌లు క‌ళ్ల‌ముందే జ‌రుగుతుంటే ఎన్నిక‌ల సంఘం ఏంచేస్తోంద‌ని నిల‌దీశారు. అమ‌రావ‌తిలో మీడియాతో మాట్లాడిన చంద్ర‌బాబు తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిపై నిప్పులు చెరిగారు. త‌మ బాధ్య‌త‌గా దొంగ ఓటర్లను పట్టుకుని పోలీసు స్టేషన్‌లో అప్పగిస్తే ఫిర్యాదు చేసిన తెలుగుదేశం నేతల్ని అక్రమంగా అరెస్టు చేయ‌డం ఏం న్యాయ‌మ‌న్నారు.

ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డంలేదు?
తిరుపతి ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ దౌర్జన్యాలపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ తప్పుడు విధానాలపై అన్ని విపక్ష పార్టీలు వరుస ఫిర్యాదులు చేశాయని, అయినా కేంద్ర ఎన్నికల సంఘం గట్టిగా చర్యలు తీసుకోలేని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. ఉదయం నుంచి వేలాది ప్రైవేటు వాహనాల్లో బయట వ్యక్తుల్ని తిరుప‌తికి త‌ర‌లించార‌ని, ఉపఎన్నిక దృష్ట్యా కనీక తనిఖీలు కూడా నిర్వహించలేదన్నారు. అసలు చెక్ పోస్టులను తీయాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌ని ప్ర‌శ్నించారు.

ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేశారు
బందిపోట్లను తలపించే విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు.. ఎన్నికలు ఓ ఫార్సుగా మారిపోవాలా అని ప్రజలు ఆత్మవిమర్శ చేసుకోవాలి.. తిరుపతిలో విలేక‌రుల సమావేశం నిర్వహించిన పెద్దిరెడ్డి ఓటు తిరుప‌తిలో ఉందా?.. మంత్రులు బరితెగించి తిరుపతి లోక్‌స‌భ ప‌రిధిలో ఉంటే అధికార పార్టీకి ఊడిగం చేస్తామన్నట్లుగా పోలీసు వ్య‌వ‌స్థ వ్య‌వ‌హ‌రిస్తోంది.. ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంటే,  వైసీపీ ఖూనీ చేసే యత్నాన్ని నేను ఖండిస్తున్నా.. కేంద్ర ఎన్నికల సంఘం అన్ని అక్రమాలకు సమాధానం చెప్పాలి..  ప్రత్యేక బలగాలు, అధికారులు ఏమయ్యారో ఈసీ చెప్పాలంటూ చంద్ర‌బాబు ఇటు వైసీపీపై, అటు ఈసీపై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. తిరుప‌తి ఉప ఎన్నిక సంద‌ర్భంగా దొంగ ఓట్లు వేయ‌డానికి వ‌చ్చిన‌వారు షోలే సినిమాలోని బందిపోటు దొంగ‌ల‌ను త‌ల‌పించార‌ని తెలుగుదేశం శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: