తిరుపతి ఉపఎన్నిక ముగిసింది. తిరుపతిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు దొంగ ఓట్లు వేయించుకున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కొందరు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి దొంగ ఓట్లు వేశారని టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలు ఆరోపించాయి. చౌడేపల్లి నుంచి వచ్చిన కొందరు ఒక ఒక ఫంక్షన్ హాల్ వద్ద ఉన్నారని టీడీపీ నేతలు విమర్శించారు. బస్ లు, ఇతర వాహనాల ద్వారా దొంగ ఓటర్లు తరలించారని ఆరోపించారు. అందుకే తిరుపతిలో మళ్లీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.


ఇక తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ విషయంలో బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది.  తిరుపతి కోదండరామస్వామి ఆలయం వద్ద ఆ పార్టీ నేతలు ఆందోళన నిర్వహించారు. తిరుపతిలో దొంగ ఓట్ల వ్యవహారంపై భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆది నారాయణ రెడ్డి, భాజపా ఎంపీ అభ్యర్థి రత్నప్రభ ఆందోళన చేశారు.  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో దొంగ ఓటర్లు ఆశ్రయం పొందారని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. స్థానికేతరుడైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలో ఎందుకున్నారని ఆయన ప్రశ్నించారు.


ప్రభుత్వ వాలంటీర్లు వైకాపా కార్యకర్తల పని చేశారని.. అడ్డగోలుగా డబ్బులు పంచి దొంగ ఓట్లు వేయించారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళతామని... తిరుపతిలో రీపోలింగ్ పెట్టి తీరాల్సిందేనని భాజపా ఎంపీ అభ్యర్థి రత్న ప్రభ ఆరోపించారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న సీఎం జగన్ ఎందుకు భయపడుతున్నారని.. దీన్ని బట్టి చూస్తే.. జగన్‌కు తన పాలన పై సందేహాలున్నాయని  ఎద్దేవా చేశారు. అందుకే తిరుపతి లో దొంగ ఓట్లు వేయించారని.. ప్రజలకు సేవ చేసే పాలన అందించి ఉంటే జగన్ భయపడేవారు కాదని ఆమె మండిపడ్డారు . తిరుపతిలో రీపోలింగ్ నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు.


ఓ ఫంక్షన్ హాల్ లో పాతిక వేల మందికి భోజనం పెట్టారని.. బయటి ప్రాంతాల నుంచి మనుషుల్ని పిలిపించారని... పోలింగ్ రోజు ఇంత జరుగుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోలేదని బీజేపీ నేతలు ప్రశ్నించారు. ఓడిపోతారని భయంతో నే నకిలీ కార్డులతో దొంగ ఓట్లు వేయించారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి  సామంచి శ్రీనివాస్ అన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: