తిరుప‌తి లోక్‌స‌భ స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌ను ప‌రిశీలిస్తే రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్యం ఉందా? అనే సందేహం అంద‌రిలో వ్య‌క్త‌మైంది. సాక్షాత్తూ ఒక మంత్రే ఏకంగా దొంగ ఓట్లు వేయించారంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపించ‌డంతోపాటు అందుకు సాక్ష్యాధారాల‌ను కూడా సేకించి కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి పంపించింది. తిరుప‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో మ‌ళ్లీ రీపోలింగ్ జ‌ర‌పాలంటూ ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు డిమాండ్ చేస్తున్నారు. సాక్ష్యాల‌న్నీ ఇచ్చిన త‌ర్వాత కూడా అక్క‌డ రీపోలింగ్ నిర్వ‌హించ‌క‌పోతే ప్ర‌జాస్వామ్యానికి అర్థ‌మే ఉండ‌దంటున్నారు.

న‌కిలీ ఓట‌ర్ ఐడీకార్డులు
తిరుపతి మొత్తం దొంగఓట్ల మయం అంటూ మీడియా ఆధారాలతో వెలుగులోకి తెచ్చింది. పోలీసుల సంగ‌తి స‌రేస‌రి. దొంగ ఓట్లను అరికట్టాంటూ ఎన్నికల ప్రధాన అధికారి కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. దొంగ ఓటర్లెవరూ రాలేదని ..ప్రశాంతంగా జరుగుతోందని డీజీపీ సర్టిఫికెట్ ఇచ్చేశారు. దాంతో అధికార యంత్రాంగంద్వారా  ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం జరగదని తేలిపోయింది. కేంద్ర ఎన్నికల సంఘానికి కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వెళ్లాయి. సాక్ష్యాలతో సహా ఫిర్యాదు చేశారు. ఇప్పుడు నిర్ణ‌యం తీసుకోవాల్సింది.. కేంద్ర ఎన్నికల సంఘమే.

పోలీసు వ్య‌వ‌స్థ ఏదీ?
ఓటర్ ఐడీ కార్డులు నకిలీవి ముద్రించడం తీవ్రమైన నేరం. అలాంటి కార్డులు వేల‌సంఖ్య‌లో ముద్రించిన‌ట్లు తేలింది. ఇలాంటి ఓటర్ కార్డుతో పట్టుబడిన వారిని తక్షణం అదుపులోకి తీసుకొని గ్యాంగ్ గుట్టు రట్టు చేయాలి. చిత్ర‌మేమిటంటే పట్టుబడిన వారిని పట్టుబడినట్లుగా పోలీసులు వదిలేశారు. కేసులు నమోదు చేయ‌లేదు. వారంతా నకిలీ ఓటర్లు కాదని.. దేవుడి దర్శనానికి వచ్చిన భక్తులని అధికార పార్టీ నేత‌లు చెబుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి కూడా అదే మాట చెప్ప‌డంతో ఎవ‌రూ ఏమీ మాట్లాడ‌లేదు. లోక్‌సభ ఉపఎన్నిక రిటర్నింగ్ అధికారిగా నెల్లూరు జిల్లా కలెక్టర్ ఉన్నారు. ఆయన ఇచ్చే నివేదికను బట్టే… తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ జరుగుతుంది. రీపోలింగ్‌కు ఆదేశిస్తే.. ఈసీ తనను తాను అవమానించుకున్నట్లేనని సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడితే అది మ‌న‌ల్ని కాప‌డుతుంది. లేదంటే దేశంలోని అన్ని వ్య‌వ‌స్థ‌లు కుప్ప‌కూలిపోతాయి. అంతిమంగా న‌ష్ట‌పోయేది దేశం, ఆ దేశంలోని ప్ర‌జ‌లు. ఇప్పుడు బంతి కేంద్ర ఎన్నిక‌ల సంఘం చేతిలోనే ఉంది.!!

మరింత సమాచారం తెలుసుకోండి: