జగనే అంతా చేశాడా. వైసీపీకి కర్త కర్మ క్రియ అయిన జగనే అన్నింటికీ మూల కారకుడా అంటే అదే ఇపుడు చర్చగా ఉంది. వైసీపీకి రేపటి రోజున తిరుపతిలో చేదు ఫలితాలు కనుక నమోదు అయితే దానికి టోటల్ గా బాధ్యుడు జగనేనా అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది.

అవును. జగన్ తాను ప్రచారానికి రాలేదు. పైగా మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రతీ నియోజక‌వర్గానికి ఇంచార్జులుగా నియమించారు. వారికి పూర్తి టార్గెట్లు కూడా ఇచ్చారు. మెజారిటీని ముందే జగన్ నిర్ణయించేశారు. అయిదు లక్షలకు తక్కువ కాకుండా మెజారిటీ సాధించాల్సిందే అన్నది జగన్ ఆదేశం  దాంతోనే వైసీపీ నేతలు తీవ్ర వత్తిడికి గురి అయ్యారని అంటున్నారు. తిరుపతి ఉప ఎన్నిక లో పోలింగ్ ఎంత శాతం జరుగుతుంది   జనాల అసక్తి ఏమిటి అన్న అంచనాలు ఏవీ లేకుండానే మెజారిటీని ముందే డిసైడ్ చేయడం వల్లనే అసలైన తిప్పలు మొదలు అయ్యాయని అంటున్నారు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు అంతా కలసి మెజారిటీ మీదనే దృష్టి పెట్టడంతోనే తిరుపతి లాంటి చోట వైసీపీ నేతలు  దొంగ ఓట్లు వేశారు  అంటూ పరువు పోగొట్టుకోవడం జరిగింది అంటున్నారు.

దీని మీద బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి అయితే గట్టిగానే కడిగి పారేశారు. 151 సీట్లు ఉండి గతంలో మంచి మెజారిటీ వచ్చిన తిరుపతి వంటి స్ట్రాంగ్ సీటులో దొంగ ఓట్లు వేయించుకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది అంటూ ఆయన వైసీపీ పెద్దలకు తలంటేశారు. నిజానికి వైసీపీ నేతల నెత్తిన కత్తి వేలాడుతోంది. దాంతోనే వారు టెన్షన్ పడుతూ ఏదోలా మెజారిటీ పెంచాలని చూశారు. కానీ పోలింగ్ శాతం బాగా తగ్గిపోవడంతో అనుకున్న మెజారిటీ దక్కేలా లేదు, దొంగ ఓట్లు వేయించారు అన్న చెడ్డ పేరును మాత్రమే చివరికి మూటకట్టుకున్నారు. హాయిగా తిరుపతి సీట్లుని దాని మానాన‌ వదిలేసినా అక్కడ అధికార పార్టీ గెలిచి వచ్చేది అన్న చర్చ ఉంది. భారీ మెజారిటీని జగన్ టార్గెట్ గా పెట్టడం వల్లనే పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అయిందని అంటున్నారు. ఇంతలా వ్రతం చెడినా ఫలితం దక్కుతుందా గత మెజారిటీ కంటే ఓట్లు ఎక్కువ వస్తాయా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: