వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్‌లో క్లీన్‌స్వీప్ చేసి తెరాస జెండాను ఎగుర‌వేసేందుకు ఆ పార్టీ నేత‌లు వ్యూహాల‌కు ప‌దునుపెడుతున్నారు. కార్పొరేష‌న్ ప‌రిధిలో 66 డివిజ‌న్‌ల‌లో తెరాస జెండాను ఎగ‌ర‌వేసేలా అధిష్టానం ఇప్ప‌టికే స్థానిక మంత్రి, ఎమ్మెల్యేల‌కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింది. ఈ క్ర‌మంలో గెలుపు గుర్రాల‌ను ఎంపిక‌చేసే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. కార్పొరేష‌న్‌లో 66 డివిజ‌న్లు ఐదు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్నాయి. దీంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్న డివిజ‌న్‌ల‌లో గెలుపు బాధ్య‌త‌ల‌ను కేటీఆర్ స్థానిక ఎమ్మెల్యేల‌కు అప్ప‌గించార‌ట‌. దీంతో అభ్య‌ర్థుల ఎంపిక‌లో స‌ద‌రు ఎమ్మెల్యేలు నిమ‌గ్న‌మ‌య్యారు.

ఈక్ర‌మంలో ఎమ్మెల్యేల‌కు కొత్త త‌ల‌నొప్పులు వ‌స్తున్నాయ‌ట‌. డివిజ‌న్‌ల వారిగా తెరాస నుంచి బ‌రిలోకి దిగేందుకు ఆశావ‌హుల సంఖ్య భారీగా ఉంద‌ట‌. దీంతో డివిజ‌న్‌లో త‌మ‌కే టికెట్ కేటాయించాలంటూ ఎమ్మెల్యేల‌పై స్థానిక నేత‌ల నుండి ఒత్తిడి పెరిగింది. దీనికితోడు ఎమ్మెల్యే ద‌గ్గ‌రి వ్య‌క్తుల ద్వారా, రాష్ట్ర స్థాయి నేత‌ల ద్వారా ప‌లువురు పైర‌వీలు చేపిస్తుండ‌టంతో ఎవ‌రికి టికెట్ ఇవ్వాలో తెలియ‌క ప‌లువురు ఎమ్మెల్యేలు చేతులెత్తేస్తున్న‌ట్లు తెలుస్తోంది. కొంద‌రైతే తాము ఉద్య‌మ‌కారుల‌మ‌ని, త‌మ‌కే బీఫాంలు ఇవ్వాల‌ని ఎమ్మెల్యేల‌ను డిమాండ్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ ప‌రిణామాల‌తో ప‌లువురు ఎమ్మెల్యేలు రాష్ట్ర పార్టీ నుంచి వ‌చ్చిన సర్వే నివేదిక ఆధారంగా బీఫాంలు ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యార‌ట‌.

డివిజ‌న్‌లో ఒక‌రికే టికెట్ ఇవ్వ‌టం సాధ్య‌మ‌వుతుంద‌ని, మిగిలిన ఆశావ‌హుల‌ను ఎలా బుజ్జ‌గించాలి, ఒక‌వేళ ఇప్పుడు స‌ర్దుమ‌ణిగినా త‌మ ఎన్నిక‌లు వ‌చ్చే స‌మ‌యానికి వారు వ్య‌తిరేకంగా మారే అవ‌కాశాలు లేక‌పోలేద‌న్న ఆందోళ‌న స‌ద‌రు ఎమ్మెల్యేల‌ను వెంటాడుతున్న‌ట్లు స‌మాచారం. నేటితో నామినేష‌న్ల దాఖ‌లు ప్ర‌క్రియ పూర్త‌వుతుండ‌టంతో టికెట్‌పై హామీ ఇవ్వ‌క‌పోయినా తొలుత నామినేష‌న్లు వేసేందుకు ఆశావ‌హులు సిద్ధ‌మ‌య్యారు. ఈనెల 22వ‌ర‌కు బీఫాంలు ఇచ్చేందుకు అవ‌కాశం ఉండ‌టంతో అధిష్టానం సూచ‌న‌ల మేర‌కు అభ్య‌ర్థుల‌కు బీఫాంలు ఇచ్చేందుకు ఎమ్మెల్యే నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తుంది. అయితే పార్టీ నుంచి టికెట్ ఆశించి రానివారు రెబ‌ల్స్‌గా బ‌రిలోఉండొద్ద‌ని, ఆ బాధ్య‌త ఎమ్మెల్యేలే చూసుకోవాల‌ని అధిష్టానం సూచించ‌డంతో.. ఆమేర‌కు స‌ద‌రు ఎమ్మెల్యేలు దృష్టిసారించిన‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు.. ఆ ప‌రిధిలోని ఎమ్మెల్యేల‌కు కొత్త త‌ల‌నొప్పులు తెచ్చిపెడుతున్నాయ‌నే చెప్ప‌వ‌చ్చు.









మరింత సమాచారం తెలుసుకోండి: