తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక కాదు కానీ రాజకీయ జీవులతో పాటు ఎన్నికల మీద అమితాసక్తిని చూపించే వారి బుర్ర తెగ హీటెక్కిపోతోంది. పోలింగ్ జరిగిన తీరు తెన్నులను ఒకటికి పదిమార్లు బేరీజు వేసుకుంటూ తమకు ఎన్ని ఓట్లు వస్తాయి అన్న కూడికలు తీసివేతలతో అభ్యర్ధులు, రాజకీయ పార్టీలు యమ బిజీగా ఉన్నారనే చెప్పాలి. .

ఇదిలా ఉంటే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో బీజేపీ ఒక టార్గెట్ పెట్టుకుని బరిలోకి దిగింది. కచ్చితంగా రెండు లక్షల‌ ఓట్లకు పై చిలుకు తమకు వస్తాయని ఆ పార్టీ అంటోంది. ఇక రెండు  లక్షల ఓట్లు వస్తే తమదే ఏపీలో ఫ్యూచర్ పాలిటిక్స్ అని కూడా భావిస్తోంది. ఏపీలో టీడీపీ ఇపుడు నిరాశా నిస్పృహలతో ఉండడంతో రెండు లక్షల ఓట్లు కనుక తాము తెచ్చుకుంటే టీడీపీ నేతల చూపు కచ్చితంగా తమ మీద ఉంటుంది అని అంచనా కడుతోంది.

దాంతో పాటుగా జనసేన తో మిత్రుత్వం ఉండడం కూడా తమకు బలమని నమ్ముతోంది. పవన్ కి ఉన్న సినీ గ్లామర్ తో పాటు  ఆయన క్రౌడ్ పుల్లర్ కావడంతో రేపటి రోజున ఏపీ రాజకీయాల్లో  దూసుకుపోతామని  కూడా ధీమాగా చెబుతోంది. ఏపీలో ఒక బలమైన సామాజికవర్గాన్ని గురి పెట్టిన బీజేపీ జనసేనతో మైత్రి వల్ల అది తమ వైపునకు తిరగడడం  సాధ్యమని  గట్టిగా నమ్ముతోంది. ఈ నేపధ్యంలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో రెండు లక్షల ఓట్లు కనుక బీజేపీ తెచ్చుకుంటే పవన్ కి భారీ గిఫ్ట్ ని కూడా రెడీ చేసి ఉంచారని అంటున్నారు.

పవన్ కి రాజ్యసభ సీటు ఇస్తారని కూడా వినిపిస్తోంది. పవన్ సేవలను పూర్తి స్థాయిలో వాడుకోవడానికి ఆయనకు అధికార హోదా కూడా కల్పిస్తారు అని కూడా చెబుతున్నారు. రేపటి రోజున ఏపీలో పవన్ కి ఏపి కోటాలో  కేంద్ర మంత్రి పదవి ఇచ్చి బీజేపీ జనసేన కూటమిని బలోపేతం చేసుకోవాలన్న ఆలోచన కూడా ఉందిట. మరి చూడాలి అదే నిజం అయితే జనసైనికుల హుషార్ కి హద్దులు ఉండవేమో, మరి ఇవన్నీ జరగాలీ అంటే బీజేపీ జనసేన కూటమి తిరుపతిలో రెండు లక్షల ఓట్లు అయినా తెచ్చుకుని సత్తా చాటాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: