తెలంగాణ‌లో నిరుద్యోగుల‌కు సంఘీభావంగా మూడురోజులపాటు సాగిన  వై.ఎస్‌. షర్మిల చేప‌ట్టిన దీక్ష ఆదివారం మ‌ధ్యాహ్నం ముగిసింది. గురువారం ఉద‌యం ఇందిరాపార్క్ వ‌ద్ద ఆమె దీక్ష‌కు దిగారు. ఈ దీక్ష‌కు పోలీసులు ఒక్క‌రోజు మాత్ర‌మే అనుమ‌తి ఇచ్చారు. అయినా ష‌ర్మిల దీక్ష‌ను కొన‌సాగించ‌డంతో పోలీసులు అడ్డుకొని ఆమె నివాసానికి త‌ర‌లించారు. దీంతో ష‌ర్మిల లోట‌స్‌పాండ్‌లోని త‌న నివాసం వ‌ద్ద దీక్ష కొన‌సాగించారు. కాగా ఆదివారం ఆమె దీక్ష‌ను విర‌మించారు. ఈ సంద‌ర్భంగా ష‌ర్మిల మాట్లాడుతూ.. ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రెండేళ్ల‌లో అధికారంలోకి వ‌చ్చేది మా పార్టీనే అంటూ బ‌ల్ల‌గుద్ది చెప్పారు.

ష‌ర్మిల తెలంగాణలో రాజ‌కీయ పార్టీని ప్ర‌క‌టించేకంటే ముందే పోరాట‌బాట ప‌ట్టారు. ఇటీవ‌ల ఖ‌మ్మంలో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌కు భారీ స్పంద‌న రావ‌డంతో.. ఆమె మ‌ద్ద‌తు దారుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తుంది. ఈ సభా వేదిక‌గా ష‌ర్మిల తెరాస ప్ర‌భుత్వంపైనా, కేసీఆర్‌, ఆయ‌న కుటుంబంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణ‌లో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని, కేసీఆర్ కుటుంబ స‌భ్యుల‌కు మాత్రం పుష్క‌లంగా ఉద్యోగాలు వ‌చ్చాయ‌ని అన్నారు. ఉద్యోగ నోటిఫికేష‌న్ ఇవ్వ‌కుండా నిరుద్యోగుల‌ను సీఎం కేసీఆర్ బ‌లితీసుకుంటున్నార‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఆ స‌భా వేదిక‌గా నిరుద్యోగుల‌కు సంఘీభావంగా తాను మూడు రోజుల దీక్ష చేస్తాన‌ని ష‌ర్మిల ప్ర‌క‌టించారు.

బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌క‌టించిన విధంగా గురువారం ఆమె దీక్ష‌కు దిగారు. పోలీసులు అడ్డుకున్నా ఇంటి వ‌ద్ద దీక్ష‌ను కొన‌సాగించారు. దీక్ష విర‌మించే స‌మ‌యంలో ఆమె మాట్లాడుతూ.. నిరుద్యోగులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవ‌ద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు. 40ల‌క్ష‌ల మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నార‌ని, ఉద్యోగాలు వ‌చ్చే వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గాల్లో మా కార్య‌క‌ర్త‌లు దీక్ష‌లు చేస్తార‌ని ప్ర‌క‌టించారు. రెండేళ్ల‌లో మా పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని, ఏం చేసైనా నిరుద్యోగాన్ని నిర్మూలిస్తాన‌ని మాటిస్తున్నా అంటూ ష‌ర్మిల పేర్కొన్నారు. ష‌ర్మిల వ్యాఖ్య‌లు తెలంగాణ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం రేపుతున్నా.. పార్టీ పేరునే ప్ర‌క‌టించ‌ని ష‌ర్మిల‌.. రెండేళ్ల‌లో తెలంగాణ ప్ర‌జ‌లచే ఎలా జై కొట్టించుకుంటార‌న్న అంశం ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది. రాష్ట్రంలో ప్ర‌భుత్వ వ్య‌తిరేక వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకొనేలా ఆమె ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని, ఇందులో భాగంగానే ఆమె ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. మ‌రి ష‌ర్మిల అన్న‌ట్లు రెండేళ్ల‌లో అధికారంలోకి ఎలా వ‌స్తుందో వేచి చ‌డాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: