దేశంలో కరోనా తీవ్రత విషయంలో ప్రజల్లో ఆందోళన మొదలయింది. కరోనా కట్టడి విషయంలో ఇప్పుడు ప్రతీ ఒక్కరు కూడా తమ వంతుగా ప్రయత్నం చేస్తున్నారు. ఇక రాష్ట్రాలు కూడా లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. కొన్ని కీలక రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. ఇక కేంద్రం కూడా త్వరలో కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే... కొవిడ్ వ్యాప్తి- ప్రజాప్రతినిధుల బాధ్యత అనే అంశంపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. సదస్సులో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు.

కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ధిష్ట ప్రణాళికతో ముందుకెళ్లాలి అని సూచించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ప్రజా ప్రతినిధులు అండగా నిలవాలి అని కోరారు. వైద్యరంగంలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి అని సూచనలు చేసారు. ప్రపంచంలోనే అత్యధిక కేసులు మన దేశంలో నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది అన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ సహా ప్రజలందరికీ టీకా అందేలా చర్యలు తీసుకోవాలి అని ఆయన సూచించారు.

కరోనా కేసుల నమోదులో దేశంలోనే ఏపీ 5వ స్థానంలో ఉంది అని, ఇప్పటివరకూ రాష్ట్రంలో 9.6 లక్షల కేసులు నమోదయ్యాయి అని ఆయన అన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రణాళికా లోపమే కేసులు పెరుగుదలకు కారణం అని ఆరోపించారు. కేంద్రం సూచించిన కరోనా నిబంధనలు ఏపీలో అమలు కావడంలేదు అని మండిపడ్డారు. విపత్కర పరిస్థితుల్లోనే నాయకత్వ సామర్థ్యం బయటపడుతుంది అని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో నేటి పరిస్థితికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అన్నారు ఏపీ ప్రభుత్వం అలసత్వం వీడి కరోనా కట్టడిపై దృష్టి పెట్టాలి అని చంద్రబాబు నాయుడు సూచించారు. టీకా ప్రక్రియను వేగవంతం చేసి అందరికీ అందేలా చర్యలు చేపట్టాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: