జీహెచ్ఎంసిలో కోవిడ్ కంట్రోల్ రూం తిరిగి ప్రారంభం కానుంది. జీహెచ్ఎంసీ నగర పారిశుధ్య కార్యక్రమాలపై ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ సమీక్ష నిర్వహించారు. హాజరైన జోనల్, డిప్యూటి కమిషనర్లు, ఏ.ఎం.హెచ్.ఓ లు... తమ అభిప్రాయాలు చెప్పారు. అర్వింద్ కుమార్ మాట్లాడుతూ... నగరంలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణలో అలసత్వం వహించే అధికారులను సహించేదిలేదు అని స్పష్టం చేసారు. మరికొద్ది రోజుల్లో వర్షాలు ఆరంభమవుతున్న దృష్ట్యా రహదారులపై పూర్తిస్థాయిలో గార్బేజ్ ను ప్రతిరోజు తొలగించడం ద్వారా అంటువ్యాధులు, కరోనా వ్యాప్తిని నివారించాలి అని సూచనలు చేసారు.

నగరంలో గార్బేజ్ తొలగింపు అనేది ప్రాథమిక విధి అని, వీటిని పూర్తిస్థాయిలో తొలగించేందుకు చర్యలు చేపట్టాలి అని స్పష్టం చేసారు.  కరోనా పరిస్థితుల్లో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణపై ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దు అన్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటలలోపే క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణను పర్యవేక్షించాలని డిప్యూటి కమిషనర్లు, ఏ.ఎం.హెచ్.ఓ లను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటించని అధికారులపై కఠిన చర్యలు చేపడతాo అని హెచ్చరించారు.

పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణపై నిర్లక్ష్యం వహించడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడమే అని అన్నారు. నగరంలో బాధ్యతారహితంగా రహదారులపై చెత్తవేసేవారిని గుర్తించి జరిమానా విధించాలి అని స్పష్టం చేసారు. జీహెచ్ఎంసీ లో 24/7  ఈ కంట్రోల్ రూం పనిచేసేవిధంగా, సీనియర్ అధికారులను పర్యవేక్షకులుగా నియమించాలి అని సూచించారు. గత సంవత్సరంలో కరోనా మొదటి దశ నియంత్రణలో మిషన్ మోడ్ తో పనిచేసిన విధంగానే ప్రస్తుతం కూడా పనిచేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ నగరంలో 310 ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో చెత్త నిల్వ కేంద్రాలు, 700 తక్కువ పరిమాణం గల చెత్త నిల్వ ప్రాంతాలు ఉన్నాయి అని అన్నారు. వీటిలో వచ్చే గార్బేజ్ ని ఎప్పటికప్పుడు తొలగించేందుకు చర్యలు చేపడుతున్నాం అని వివరించారు. చెత్త తరలింపుకు వినియోగించే వాహనాలన్నీ ప్రతి రోజు ఉదయం 5 గంటలలోపే క్షేత్రస్థాయిలో పని ప్రారంభించేలా తనిఖీలు చేస్తున్నాం అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: