తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి  ఆయన తన ఫామ్‌ హౌజ్‌లోనే హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. వ్యక్తిగత వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అయితే ఆయన అనూహ్యంగా  బుధవారం అనూహ్యంగా  హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వచ్చారు. ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్ రావుకి సోమాజిగూడ యశోద హాస్పిటల్‌లో సిటి స్కాన్, ఇతర సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.

సీఎం కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు ఎం. వి. రావు ఆధ్వర్యంలో ఈ పరీక్షలను నిర్వహించారు. సిఎం కేసీఆర్ ఊపిరితిత్తులు సాధారణంగా వున్నాయని, ఎటువంటి ఇన్పెక్షన్ లేదని డాక్టర్లు తెలిపారు. సాధారణంగా నిర్వహించే రక్త పరీక్షల నిమిత్తం కొన్ని రక్త నమూనాలను సేకరించారు. రక్త పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు రేపు రానున్నాయి. సిఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా వుందని.. ఆయన త్వరలో కోలుకుంటారని పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు వెల్లడించారు.

సీఎం కెసిఆర్ వెంట.. మంత్రి కేటీఆర్, ఎంపి సంతోష్ కుమార్, ఇతర కుటుంబ సభ్యులున్నారు. ఆ తర్వాత కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు ఎం వీ రావు కేసీఆర్ ఆరోగ్యంపై కొన్ని వివరాలు చెప్పారు. సీఎం కేసీఆర్ కు సాధారణ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. సీటీ స్కానింగ్ చేశాం, నార్మల్ గానే ఉందని తెలిపారు. అంతే కాదు.. సీఎంకు కోవిడ్ లక్షణాలు పోయాయని ఎంవీ రావు వివరించారు. ముఖ్యమంత్రి పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని.. త్వరలోనే విధులకు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. అంతే కాదు.. కేసీఆర్‌ ఆక్సిజన్ లెవల్స్ మంచిగా ఉన్నాయని తెలిపారు.

మొత్తం మీద సీఎం కేసీఆర్ కరోనా నుంచి చాలా వేగంగా కోలుకుంటున్నారనే చెప్పాలి. కేసీఆర్ ఆరోగ్యం గురించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లోనూ పూజలు  చేయిస్తున్నారు. ఇంకొందరైతే ఏకంగా యోగాలు కూడా చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: