కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్ద‌లు అన్ని రాష్ట్రాల్లో పార్టీని విస్త‌రించేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే ఉత్త‌రాది రాష్ట్రాల్లో పాగా వేస్తున్న ఆ పార్టీ.. ద‌క్షిణాదిలో తెలంగాణ‌పై గురిపెట్టింది. నాలుగు ఎంపీ స్థానాల‌తో పాటు, ఇటీవ‌ల సిద్ధిపేట ఉప ఎన్నిక‌, జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో స‌త్తాచాటిన ఆ పార్టీ.. 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో అధికారాన్ని చేజిక్కించుకోవ‌ట‌మే ల‌క్ష్యంగా ముందుకెళ్తుంది. రాష్ట్ర పార్టీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ సార‌థ్యంలో పార్టీ శ్రేణులు దూకుడుగా ముందుకెళ్తున్నారు. అయితే ఇటీవ‌ల లింగోజిగూడ డివిజ‌న్ ఉపఎన్నిక ఆ పార్టీలో అంత‌ర్గ‌త విబేధాల‌ను బ‌య‌ట‌పెట్టింది. ఈ డివిజ‌న్ నుంచి మృతిచెందిన ర‌మేష్‌గౌడ్ కుమారుడు అఖిల్ గౌడ్‌ను బీజేపీ బ‌రిలోకి దింపింది.

అఖిల్ గౌడ్ అభ్య‌ర్థిత్వాన్ని ఏక‌గ్రీవం చేయాలంటూ ఇటీవ‌ల మాజీ ఎమ్మెల్సీ రామ‌చంద్ర‌రావు, రంగారెడ్డి జిల్లాకు చెందిన ప‌లువురు నేత‌లు మంత్రి కేటీఆర్‌ను క‌లిశారు. వీరు కేటీఆర్‌ను క‌ల‌వ‌టం ప‌ట్ల బండి సంజ‌య్ తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు. దీనికితోడు బీజేపీలో అంద‌రూ మంచివాళ్లేన‌ని, ఒక్క  బండిసంజ‌య్ మాత్రం త‌న‌తీరు మార్చుకోవాలంటూ త‌న‌ను క‌లిసివారితో కేటీఆర్ అన్నార‌ని, అయినా బీజేపీ నేత‌లు నోరు మెద‌ప‌లేద‌ని ప్ర‌చారం సాగుతుంది. ఇదే విష‌యాన్ని బండి సంజ‌య్ కేంద్ర పెద్ద‌ల‌కు ఫిర్యాదు చేయ‌డంతో పాటు త్రిస‌భ్య‌ క‌మిటీనిసైతం వేశారు. ఆ క‌మిటీ రిపోర్టు ఆధారంగా కేటీఆర్‌ను క‌లిసిన వారిపై చ‌ర్య‌ల‌కు సంజ‌య్ సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది.

ఇప్ప‌టికే బీజేపీలో రెండు వ‌ర్గాల మ‌ధ్య అంత‌ర్గ‌త వ‌ర్గ‌పోరు సాగుతున్న‌ట్లు స‌మాచారం. బండి సంజ‌య్ దూకుడుతో తాత్కాలికంగా ల‌బ్ధిచేకూరుతున్నా.. ధీర్ఘ‌కాలంపాటు పార్టీప‌టిష్ఠ‌త‌కు ఉప‌యోగ‌ప‌డ‌ద‌ని బీజేపీలోని ఓ వ‌ర్గంవారు భావిస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే స‌మ‌యం చిక్కిన‌ప్పుడ‌ల్లా త‌మ‌దైన పంథాలో సంజ‌య్ హ‌వాను త‌గ్గించేందుకు ఆ వ‌ర్గం నేత‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌న్న ప్ర‌చారం సాగుతుంది. వీరికి కేంద్రంలో పెద్ద‌లవ‌ద్ద ప‌లుకుబ‌డి ఉండ‌టంతో వారి ద్వారా ప‌లు విష‌యాల‌పై సంజ‌య్‌పై ఒత్తిడి తెస్తున్న‌ట్లు  పార్టీ నేత‌ల్లో చ‌ర్చ‌సాగుతుంది. జిల్లా స్థాయిలోనూ రెండువ‌ర్గాలుగా పార్టీ నేత‌లు చీలిపోతున్న‌ట్లు స‌మాచారం. జిల్లా, ప‌ట్ట‌ణ స్థాయిల్లోని సీనియ‌ర్ నేత‌ల్లో అధిక‌మంది సంజ‌య్‌కు వ్య‌తిరేకంగా కార్య‌క‌లాపాలు సాగిస్తున్నార‌న్న చ‌ర్చ బీజేపీలో సాగుతుంది. ఈ క్ర‌మంలో లింగోజిగూడ ఘ‌ట‌న‌ను స‌ద్వినియోగం చేసుకుంటూ త్రిస‌భ్య క‌మిటీ ద్వారా కేటీఆర్‌ను క‌లిసిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బండి సంజ‌య్ భావిస్తున్నార‌ట‌. దీంతో త‌న‌కు వ్య‌తిరేక వ‌ర్గీయుల‌ను క‌ట్ట‌డి చేయ‌వ‌చ్చ‌ని సంజ‌య్ వ‌ర్గం భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. సంజ‌య్ ఎత్తుగ‌డ‌ల‌ను అడ్డుకొనేందుకు మ‌రోవ‌ర్గం త‌మ‌దైన శైలిలో ముందుకెళ్తున్న‌ట్లు బీజేపీ నేత‌ల్లో చ‌ర్చ‌సాగుతుంది. పార్టీలో సాగుతున్న ఈ అంత‌ర్గ‌త ‌పోరును చూస్తున్న ప‌లువురు బీజేపీ నేత‌లు.. తెలంగాణ బీజేపీ మ‌రో కాంగ్రెస్‌లా మారుతుంద‌ని పేర్కొంటుండ‌టం గ‌మ‌నార్హం.













మరింత సమాచారం తెలుసుకోండి: