కరోనా కల్లోల సమయంలో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ఏప్రిల్ 30న జరగాల్సిన రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. బుధవారంలో ఉపసంహరణ గడువు ముగియనుంది. అయితే రాష్ట్రంలో కరోనా పంజా విసురుతున్నందున ఎన్నికలు వాయిదా వేయాలని విపక్షాలు కోరుతున్నాయి. ఎన్నికలు జరుగుతున్న నగర, పట్టణ ప్రాంత ప్రజలు కూడా ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయినా ఎన్నికల నిర్వహణకే ఎస్ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ఎన్నికల వాయిదా కోసం హైకోర్టుకు వెళ్లారు  కాంగ్రెస్ నేతలు.

మున్సిపల్ ఎన్నికలు రద్దు చేయాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్‌లో లంచ్ మోషన్ పిటిషన్‌ను కాంగ్రెస్ నేత షబ్బీర్అలీ దాఖలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలని షబ్బీర్అలీ కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నైట్ కర్ఫ్యూను అమలు చేసిందని పేర్కొన్న పిటీషనర్.. ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ నిరాకరించారు. ఎన్నికల కమిషన్‌కు మరోసారి రిప్రజెంట్ చేయాలని పిటీషనర్‌కు చీఫ్ జస్టిస్ సూచించారు. ఇప్పటికే హైకోర్టు సింగిల్ బెంచ్ ఎన్నికలను ఆపలేమని చెప్పడంతో డివిజన్ బెంచ్‌లో పిటీషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణకు అనుమతి ఇవ్వకపోవడంతో షబ్బీర్ అలీ రెగ్యులర్ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు.

కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న వరంగల్, ఖమ్మంతో పాటు సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, అచ్చంపేట, నకిరేకల్ మున్సిపల్ ప్రజలు కూడా ఎన్నికలు వాయిదా వేయాలనే కోరుతున్నారు. స్థానిక నేతలు కూడా ఎన్నికలకు భయపడుతున్నారు. కరోనా వణికిస్తున్న సమయంలో తాము ప్రచారం చేయడం కూడా కష్టమనే భావనలో ఉన్నారు నేతలు. ఈ నేపథ్యంలో ఎన్నికల వాయిదాపై హైకోర్టు ఏం చేస్తుందన్నది ఆసక్తిగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: