ఖ‌మ్మం తెరాస‌లో వ‌న్‌మేన్ షో న‌డుస్తుంది. ఖ‌మ్మం కార్పొరేష‌న్‌లో తెరాస అభ్య‌ర్థుల గెలుపు బాధ్య‌త‌ల‌ను భుజానికెత్తుకున్న మంత్రి పువ్వాడ అజ‌య్‌కుమార్ అన్ని వ్య‌వ‌హారాల‌ను త‌న క‌నుస‌న్న‌ల్లోనే న‌డిపిస్తున్నారు. ఖ‌మ్మం జిల్లా తెరాస‌లో అజ‌య్‌తో పాటు తుమ్మ‌ల‌, పొంగులేటి, నామాలాంటి బ‌ల‌మైన నేత‌లు ఉన్న‌ప్ప‌టికీ అధిష్టానం మొత్తం అజ‌య్‌పైనే భారంమోపింది. దీంతో అజ‌య్ దూకుడు ముందు తుమ్మ‌ల‌, పొంగులేటి వ‌ర్గీయులు తేలిపోతున్నార‌ట‌. అజ‌య్‌ను కాద‌ని పార్టీ బీఫాంను ద‌క్కించుకొనే ప‌రిస్థితి లేక‌పోవ‌టంతో త‌మ వ‌ర్గీయుల‌కు టికెట్లు ఇప్పించుకోలేని ప‌రిస్థితి తుమ్మ‌ల‌, పొంగులేటికి ఏర్ప‌డింద‌న్న చ‌ర్చ జిల్లాలో సాగుతుంది.

ఖ‌మ్మం కార్పొరేష‌న్‌లో అజ‌య్‌తో పాటు తుమ్మ‌ల‌, పొంగులేటికిసైతం బ‌ల‌మైన క్యాడ‌ర్ ఉంది. వారి వ‌ర్గీయులుసైతం ఈ ద‌ఫా కార్పొరేష‌న్‌లో తెరాస త‌ర‌పున బ‌రిలోకి దిగేందుకు సిద్ధ‌మ‌య్యారు. త‌మ వ‌ర్గీయులుగా ఉన్న‌వారికి టికెట్లు ఇప్పించుకొనేందుకు పొంగులేటి తీవ్ర ప్ర‌య‌త్నాలు చేశార‌ట‌. ఈ క్ర‌మంలో మంత్రి కేటీఆర్ వ‌ద్ద త‌మ వ‌ర్గీయుల‌తో కూడిన లిస్ట్ను ఉంచిన‌ట్లు స‌మాచారం. మంత్రి కేటీఆర్ మాత్రం అంతా అజ‌య్‌చూస్తున్నాడు, టికెట్ల కేటాయింపు విష‌యం జిల్లాలో మాట్లాడుకోండి అంటూ బ‌దులిచ్చార‌ని, దీంతో పువ్వాడ‌తో పొంగులేటి భేటీ అయ్యి త‌న‌వ‌ర్గీయుల‌కు కావాల్సిన డివిజ‌న్‌ల‌పై చ‌ర్చించిన‌ట్లు ప్ర‌చారం సాగుతుంది. కేటీఆర్‌తో మాట్లాడినా, పువ్వాడ‌తో భేటీఅయినా అనుకున్న స్థాయిలో పొంగులేటి త‌న వ‌ర్గీయుల‌కు టికెట్లు ఇప్పించుకోలేక పోయార‌ట‌.

తుమ్మ‌ల మాత్రం కార్పొరేష‌న్ ఎన్నిక‌ల విష‌యంలో క‌ల్పించుకోవ‌టం లేద‌న్న చ‌ర్చ సాగుతుంది. ఆయ‌న వ‌ర్గీయులు తుమ్మ‌ల ద్వారా టికెట్లు ఇప్పించుకొనేందుకు ప్ర‌య‌త్నాలు చేసినా, పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌ట‌. దీంతో చేసేదేమీలేక తుమ్మ‌ల వ‌ర్గీయుల్లోని ప‌లువురు పువ్వాడ వ‌ర్గంలోచేరి నామినేష‌న్లు వేయాల్సి వ‌చ్చింది. ఇక నామా నాగేశ్వ‌ర‌రావుసైతం త‌న వ‌ర్గీయుల‌కు ఆశించిన‌న్ని స్థానాల్లో టికెట్లు ఇప్పించుకోలేక పోయార‌ట‌. కేవ‌లం రెండు డివిజ‌న్‌ల‌లో మాత్ర‌మే నామా చెప్పిన‌వారికి టికెట్లు ద‌క్కాయ‌న్న చ‌ర్చ‌సాగుతుంది. 60 డివిజ‌న్‌ల‌కుగాను సుమారు 50 డివిజ‌న్‌లలో త‌న‌వ‌ర్గీయుల‌కు పువ్వాడ బీఫాంలు ఇచ్చి బ‌రిలోకి దింపార‌ట‌. మ‌రి పువ్వాడ వ‌న్‌మేన్ షో.. కార్పొరేష‌న్‌లో ఎంత‌మంది తెరాస అభ్య‌ర్థుల‌ను విజ‌య‌తీరాల‌కు చేర్చుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: