నియంత్రణ చర్యలు, ఆక్సిజన్ , రెమిడెసివిర్‌ ఇంజక్షన్ల సరఫరాలో కేంద్ర సర్కార్ తీరుపై తెలంగాణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరను రాష్ట్రాలకు 4 వందల రూపాయలుగా నిర్ణయించడంపై కేటీఆర్ మండిపడ్డారు. తాజాగా వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కూడా కేంద్రం తీరును ఎండగట్టారు. తెలంగాణపై వివక్ష చూపిస్తోందని ధ్వజమెత్తారు.

రెమ్‌డెసివిర్ స‌ర‌ఫ‌రాను కేంద్ర ప్ర‌భుత్వం తన అధీనంలోకి తీసుకుందని చెప్పారు ఈటల. తెలంగాణ‌ ప్రభుత్నం 4 లక్షల రెమిడెసివిర్‌ ఇంజక్షన్ల కోసం ఆర్డర్లు ఇస్తే 21,550 మాత్రమే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. దీనిపై నిరసన తెలుపుతున్నామ‌ని అన్నారు. తెలంగాణ‌లో ఉత్పత్తయ్యే రెమిడెసివిర్‌ ఇంజక్షన్లను రాష్ట్రానికే కేటాయించాలని డిమాండ్ చేశారు.  హైదరాబాద్‌లో తెలంగాణకు చెందిన‌ రోగులే కాకుండా ఆంధ్ర‌ప్ర‌దేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఏపీ, కర్ణాటకకు చెందిన‌ రోగులు కూడా చికిత్స పొందుతున్నార‌ని చెప్పారు. అందుకే తెలంగాణకు ఎక్కువ డోసులు ఇవ్వాల్సిందేనని రాజేందర్ స్పష్టం చేశారు.

తెలంగాణలో సెకండ్ వేవ్ తీవ్రంగా ఉందన్నారు ఈటల రాజేందర్. గాంధీ ఆసుప‌త్రిలో మొద‌టిసారి 600 మందికిపైగా రోగులు ఐసీయూలో ఉన్నారని  చెప్పారు. కొన్ని ప్రైవేటు ఆసుప‌త్రులు డ‌బ్బులు క‌ట్ట‌ని రోగుల‌ను గాంధీకి పంపుతున్నాయని చెప్పారు.  రోగుల ప‌రిస్థితి విష‌మిస్తే కూడా కొన్ని ప్రైవేటు ఆసుప‌త్రులు గాంధీ ఆసుప‌త్రికి పంపుతున్నాయని తెలిపారు. ప్రైవేటు ఆసుప‌త్రులు రోగిని చేర్చుకున్న‌ప్ప‌టి నుంచి వారి ప‌ట్ల జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని, మంచి వైద్యం అందించాల‌ని ఈటల చెప్పారు.


దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. జనాలు ప్రాణ భయంతో బతుకుతున్నారు. పలు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించుకున్నాయి. దేశంలో క‌రోనా ఉగ్ర‌రూపం దాల్చడంతో ఈ  అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీక‌రించింది. క‌రోనా వ్యాప్తి నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌పై కేంద్ర ప్ర‌భుత్వానికి నోటీసులు జారీ చేసింది.  కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ఆక్సిజన్, ముఖ్యమైన మందుల సరఫరా, వ్యాక్సినేషన్ విధానంపై ఓ జాతీయ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: