ఏపి లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం మరింత వేగంగా వ్యాపిస్తుంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య రెట్టింపు అవుతుంది. పాఠశాలలు కూడా ప్రభుత్వం బంద్ చేసిన సంగతి తెలిసిందే. కొన్ని కాలేజీల్లో కరోనా కేసులు రావడంతో తాత్కాలికంగా సెలవులు ఇస్తూ ఆయా కాలేజీల యాజమాన్యాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. సామూహికంగా జనాలు మసలుతున్న ప్రాంతాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే పలు నగరాల్లో కర్ఫ్యూ, ఆంక్షలు విధిస్తూ కరోనా కట్టడికి అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.. 


ఇకపోతే ఆర్టీసి బస్సులు విషయంలో కూడా అనుమానాలు నెలకొన్నాయి. గతేడాది నెలకొన్న పరిస్థితులే ఈ సారి కూడా ఉత్పన్నమవుతుండటంతో బస్సు సర్వీసులను నిలిపివేస్తారా? తాజాగా ఏపీఎస్ఆర్టీసీ ఎండీ కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్ అన్ని జిల్లాల ప్రాంతీయ మేనేజర్లు, ఈడీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని బస్సులు, బస్టాండ్లలో శానిటైజర్ వినియోగం, భౌతిక దూరం పాటించడం, అందరూ మాస్కులు ధరించేలా అవగాహన కల్పించడం చేయాలని సూచించారు. బస్ స్టేషన్లు, కార్యాలయాల్లో ఎప్పటికప్పుడు సోడియం హైపోక్లోరైట్ తో శానిటైజేషన్ జరిగేలా చూడాలన్నారు. బస్సుల్లో ఎవరైనా మాస్కులు లేకుండా కనిపిస్తే అక్కడికక్కడే వారికి మాస్కులు అందజేయాలన్నారు.. 


అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని బస్సు సర్వీసులను ఉంచాలా, తగ్గించాలా అనేది చూస్తామని ఆయన పేర్కొన్నారు.ప్రస్తుతానికి బస్సు సర్వీసులను నిలిపివేసే ఉద్దేశం లేదన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను బట్టి బస్సు సర్వీసుల విషయంలో నిర్ణయాలు ఉంటాయన్నారు. ఇదే సమయంలో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో కూడా ఆర్పీ ఠాకూర్ కీలక విషయాలు వెల్లడించారు. 45 ఏళ్లు దాటిన ప్రతీ ఉద్యోగి వ్యాక్సినేషన్ వేసుకోవాలని ఆయన సూచించారు. ఎవరైనా ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగి కరోనా బారిన పడితే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా క్యాజువల్ లీవ్ లు ఇస్తున్నట్లు ప్రకటించారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: