తెలంగాణ‌లో 2024 నాటికి జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అధికార‌మే ల‌క్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతుంది. గ్రామ స్థాయి నుంచి పార్టీని బ‌లోపేతం చేసే ప‌నిలో ఆ పార్టీ నేత‌లు నిమ‌గ్న‌మ‌య్యారు. రాష్ట్ర పార్టీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఆధ్వ‌ర్యంలో క‌మిటీలు ఏర్పాటు చేసుకొని నేత‌లు ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నారు. ఈ క్ర‌మంలో దుబ్బాక ఉప ఎన్నిక గెలుపు, జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో 50కిపైగా డివిజ‌న్‌ల‌లో క‌మ‌లం జెండా ఎగుర‌వేయ‌డంతో బీజేపీ శ్రేణుల్లో మ‌రింత ఉత్సాహాన్ని ఇచ్చింది. అంతాస‌జావుగా సాగుతున్న స‌మ‌యంలో లింగోజిగూడ డివిజ‌న్ ఉపఎన్నిక ఆ పార్టీలో అంత‌ర్గ‌త విబేధాల‌ను బ‌హిర్గ‌తం చేసింది.

లింగోజిగూడ డివిజ‌న్‌లో గెలిచిన బీజేపీ అభ్య‌ర్థి ఆకుల ర‌మేష్‌గౌడ్ ఆక‌స్మిక మ‌ర‌ణంతో ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఈ ఉప ఎన్నిక‌లో బీజేపీ ర‌మేష్‌గౌడ్ కుమారుడిని బ‌రిలోకి దింపింది. అయితే ఈ స్థానాన్ని ఏక‌గ్రీవం చేసేందుకు పలువురు బీజేపీ నేత‌లు ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో మంత్రి కేటీఆర్‌ను క‌లిశారు. లింగోజిగూడ డివిజ‌న్ ఏక‌గ్రీవానికి స‌హ‌క‌రించాల‌ని కేటీఆర్‌ను కోరారు. ఈ వ్య‌వ‌హార‌మే రాష్ట్ర బీజేపీలో దుమారానికి కార‌ణ‌మైంది. క‌నీస స‌మాచారం ఇవ్వ‌కుండా కొంద‌రు నేత‌లు ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో మంత్రి కేటీఆర్‌తో స‌మావేశ‌మైన ఘ‌ట‌న‌పై బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ సీరియ‌స్ అయ్యారు. నిజ‌నిర్దార‌ణ క‌మిటీ వేసి విచార‌ణ‌కు ఆదేశించారు. ఈ క‌మిటీలోని స‌భ్యులు రెండు రోజుల పాటు 15మందిని విచారించిన‌ట్లు తెలుస్తోంది. ఈ విచార‌ణ‌లో ప‌లువురు బీజేపీ నేత‌లు త‌ప్పు జ‌రిగింద‌ని, ఇలా అవుతుంద‌నుకోలేద‌ని, మ‌రోసారి ఇలాంటి పొర‌పాట్లు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌తామంటూ విన్న‌వించుకుంటున్న‌ట్లు స‌మాచారం.

అస‌లు ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ఎన్నిగంట‌లు ఉన్నారు.. కేటీఆర్ ఏ మాట్లాడారు.. బండి సంజ‌య్‌పై కేటీఆర్ ఎలాంటి వ్యాఖ్య‌లు చేశాడు.. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఎందుకు గంట‌ల త‌ర‌బ‌డి వేచిచూడాల్సి వ‌చ్చింది..? అనే విష‌యాల‌పై క‌మిటీ స‌భ్యులు స‌ద‌రు బీజేపీ నేత‌ల నుంచి కూపీలాగిన‌ట్లు తెలుస్తుంది. ఈ వివ‌రాల‌తో కూడిన నివేదిక‌ను బండిసంజ‌య్‌కు అందించేందుకు క‌మిటీ స‌భ్యులు సిద్ధ‌మ‌య్యారట‌. ఈ నివేదిక‌ను జాతీయ నాయ‌క‌త్వానికి పంపించే ఆలోచ‌న‌లో సంజ‌య్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ క‌మిటీ ఆధారంగా జాతీయ నాయ‌క‌త్వం స‌ద‌రు నేత‌ల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుంద‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే కేటీఆర్‌తో భేటీ అయిన బీజేపీ నేత‌ల్లో అధిక‌శాతం మంది త‌ప్పుజ‌రిగిపోయింది.. మ‌రోసారి పొర‌పాటు జ‌ర‌గ‌దు అని వివ‌ర‌ణ ఇవ్వ‌డంతో ఈసారికి జాతీయ నాయ‌క‌త్వం కూడా ఈ వ్య‌వ‌హారాన్ని లైట్‌గా తీసుకుంటుంద‌న్న వాద‌న వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: