ఆయన టెక్నికల్ గా వైసీపీ ఎంపీ. అదే సమయంలో ఆయన ప్రతీ రోజూ ఠంచనుగా ఢిల్లీలో రచ్చ బండ మీటింగ్ పెట్టి మరీ తాను ఉన్న పార్టీ ప్రభుత్వాన్నే విమర్శిస్తూంటారు. ఆయన జోరుని ఆపడం వైసీపీ హై కమాండ్ వల్ల అసలు కావడంలేదు.

ఏడాదిగా జరుగుతున్న ఈ యుద్ధంలో వైసీపీ అధినాయకత్వం చేతులు ఎత్తేసినట్లుగానే ఉంది మరి. అందుకే రాజు ఇంకా ధాటీగా విమర్శలు చేస్తున్నారు. అంతే కాదు ఆయన ఒక్క లెక్కన చెడుగుడు ఆడుకుంటున్నారు. వైసీపీకి పరమ శత్రువు అయిన టీడీపీ అయినా కొన్ని విషయాల్లో పట్టించుకోకపోవచ్చు కానీ రాజు మాత్రం ప్రతీ చిన్న విషయాన్ని అసలు వదలడంలేదు. ఆయన జగన్ సర్కార్ మీద మహా సంగ్రామమే సాగిస్తున్నారు.

ఇప్పటికే జగన్ బెయిల్ ని రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఆయన తాజాగా తిరుపతిలో దొంగ ఓట్ల గురించి ఏకంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. దొంగ ఓట్లు అన్నవి దేశ ద్రోహమని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. నకిలీ ఐడీలను తయారు చేస్తున్న వారినీ పార్టీలను అసలు ఉపేక్షించకూడదు అని కూడా ఆయన అంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఆయన లేఖ రాశారు.  బాధ్యులైన  వారి మీద   గట్టి యాక్షన్ తీసుకోవాలని కూడా ఆయన కోరుతున్నారు.

మొత్తానికి రాజు చేస్తున్న హడావుడి, ఆయన ప్రభుత్వం మీద పార్టీ మీద చేస్తున్న విమర్శలు భరించలేనివిగా ఉన్నా కూడా వైసీపీ ఏం చేయలేక చేష్టలుడిగి చూస్తూండిపోతోంది. గత ఏడాది ఇదే సమయాన ఆయన మీద అనర్హత వేటు వేయాలంటూ ఏకంగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా వద్దకు వైసీపీ ఎంపీల బృందం వెళ్ళి వినతిపత్రం ఇచ్చి వచ్చింది. దాని కోసం ప్రత్యేక విమానంలో కూడా వెళ్లారు. అయినా సరే ఆ పిటిషన్ మీద ఇప్పటిదాకా ఏ రకమైన యాక్షన్ లేదు.

రాజుకు బీజేపీ పెద్దలతో సాన్నిహిత్యం ఉందని అంటున్నారు. అలాగే ఆరెస్సెస్ నేతలతో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. దాంతో ఆయనని బీజేపీ పెద్దలే వెనకేసుకువస్తున్నారు అన్న అనుమానాలు కూడా వైసీపీ నేతల్లో ఉన్నాయి. సరే ఏ రకంగా చూసుకున్నా రాజు బలవంతుడే అంటున్నారు. దాంతో ఆయన తనకు తానుగా రాజీనామా చేస్తే తప్ప ఆయన్ని ఇంటికి పంపడం కష్టమన్న మాట కూడా ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో రాజు విజేతగా నిలవడంతోనే ఆయన వైసీపీ మెద తన బాణాలను అలుపూ సొలుపూ లేకుండా ఎక్కుపెడుతున్నా కూడా వైసీపీ పెద్దలు ఏమీ చేయలేకపోతున్నారు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: