కరోనా మహమ్మారి బీభత్సానికి  దేశం వణికిపోతోంది. హాస్పిటల్స్ అన్ని కరోనా రోగులతో నిండిపోయాయి. ఆక్సిజన్ కొరతతో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. తమ కళ్ల ముందే శ్వాస ఆడక రోగులు విలవిలలాడుతున్నా వైద్యులు ఏమి చేయలేక కన్నీళ్లు కార్చుతున్నారు. ఆక్సిజన్ కోసం కేంద్రంపై రాష్ట్రాలు ఒత్తిడి తెస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల మధ్య ట్యాంకర్ల కోసం గొడవలు కూడా జరుగుతున్నాయి. హర్యానా, ఢిల్లీ మంత్రుల మధ్య మాటల యుద్ధమే సాగింది. ఆక్సిజన్ సరఫరాలో కేంద్రం తమపై వివక్ష చూపుతుందని తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి.

కొవిడ్ పై ప్రధాని మోడీ శుక్రవారం ముఖ్యమంత్రులతో నిర్వహించిన అత్యున్నత స్థాయి వర్చువల్ సమావేశంలోనూ ఆక్సిజన్ అంశమే  ప్రధానంగా మారింది. కరోనా పరిస్థితి చాలా దారుణంగా ఉందని, పరిస్థితులు అదుపు తప్పుతున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. ఆక్సిజన్ కొరత చాలా ఎక్కువగా ఉందని... పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరారు. పరిస్థితులు చేయిదాటిపోతే, మహా విషాదం తప్పదని అన్నారు. ఆక్సిజన్ సరఫరా ఆగిపోయి, రోగి కొనఊపిరితో ఉన్నప్పుడు... ఆ పరిస్థితి గురించి తాను ఎవరితో మాట్లాడాలని సూటిగా ప్రశ్నించారు.  

కొన్ని రాష్ట్రాలు ఆక్సిజన్ రవాణా వాహనాలను ఆపేస్తున్నాయని... ఈ విషయంలో కేంద్రం రాష్ట్రాలతో మాట్లాడాలని కేజ్రీవాల్ సూచించారు. ఢిల్లీ ముఖ్యమంత్రిని అయినప్పటికీ తాను ఏమీ చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రంతా నిద్ర పట్టడం లేదని అన్నారు. ఢిల్లీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినీ తనను క్షమించాలని కోరారు. దేశంలోని ఆక్సిజన్ ప్లాంట్లను సైన్యం స్వాధీనం చేసుకోవాలని అన్నారు. కరోనా వ్యాక్సిన్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన ధరకు అందజేయాలని డిమాండ్ చేశారు.

మరోవైపు దేశంలో క‌రోనా ఉగ్ర‌రూపం దాల్చడంతో కొవిడ్‌ నియంత్ర‌ణ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌పై వివ‌రాలు తెల‌పాల‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆసుప‌త్రుల్లో రోగులు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నార‌ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే అన్నారు. ఔష‌ధాలు, వ్యాక్సినేషన్ కు అనుసరిస్తున్న విధానంతో పాటు లాక్డౌన్ ఆంక్ష‌ల‌పై ఆయ‌న ఆరా తీశారు. తదుపరి విచారణను ఏప్రిల్ 27కు వాయిదా వేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: