పేదలకు అందిస్తున్న వైఎస్సార్ కానుక పెన్షన్లలో కోత పెట్టేందుకు రంగం సిద్దం చేస్తోంది ఆంధ్రప్రదేశ్ సర్కార్. లక్షలాది మంది లబ్దిదారులను ఏరివేయడమే లక్ష్యంగా కొత్త రూల్స్ తీసుకువచ్చింది. జగన్ సర్కార్ తాజాగా పెట్టబోతున్న నిబంధనలతో లక్షలాది మంది పెన్షన్లకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి బోగస్ లబ్దిదారులు ఎక్కువ ఉన్నారని చెబుతోంది. ఇదే కారణంతో  కొత్త రూల్స్ తీసుకొచ్చింది ఏపీ సర్కార్. వైఎస్‌ఆర్‌ పింఛను కానుకలో భాగంగా కులవృత్తులు, మెడికల్‌ విభాగాల అర్హుల్ని గుర్తించేందుకు కొత్త నిబంధనలు పొందుపర్చింది.

పెన్షన్ పొందాలంటే తప్పనిసరిగా దరఖాస్తుదారులు వారి కులవృత్తియే జీవనాధారం చేసుకొని ఉండాలన్నది కొత్త రూల్. మెడికల్‌, ఒంటరి పెన్షన్ల విషయంలోనూ ఇక, కఠినమైన రూల్స్ పాటించబోతోంది. వీటికి అవసరమైన పత్రాలను ఎక్సైజ్‌, సాంఘిక సంక్షేమ శాఖ, చేనేత, జౌళిశాఖ, మత్స్యశాఖ, వైద్యశాఖలు జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దరఖాస్తు ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయిలో వాలంటీర్లు, సచివాలయ సంక్షేమ కార్యదర్శులు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఉన్నతాధికారులకు అందజేస్తారు. లబ్ధిదారుల వృత్తికి జియోట్యాగింగ్‌ చేసి వారి లాగిన్లు ద్వారా తిరిగి శాఖాధికారుల పరిశీలనకు పంపించాలి. అక్కడ అనుమతి లభించిన దరఖాస్తులకే ఎంపీడీవో, పురపాలిక అధికారులు మంజూరుకు సిఫార్సు చేస్తారు. ఈ ప్రక్రియను 21 రోజుల్లో పూర్తి చేయాలని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఏపీలో 61.28 లక్షల మంది వివిధ ప్రభుత్వ పథకాలలో లబ్ధిదారులుగా ఉన్నారు. అయితే జగన్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన కొత్త రూల్ తో లక్షలాది మందికి గండమే. ఎందుకంటే ఇప్పుడు కులవృత్తులు ఎక్కడా సాగడం లేదు. అన్నింటా యంత్రాలు రావడంతో చేతివృత్తులు ఎప్పుడో మూలకు పడ్డాయి. దీంతో ప్రస్తుతం కులవృత్తుల విభాగంలో పెన్షన్లు తీసుకుంటున్న వారందరికి గండమే. కోత పెట్టడమే లక్ష్యంగా మెడికల్‌, ఒంటరి పెన్షన్ల విషయంలోనూ ఇక, కఠినమైన రూల్స్ పాటించబోతోందని తెలుస్తోంది. జగన్ రెడ్డి సర్కార్ నిర్ణయంపై పెన్షన్ లబ్దిదారుల నుంచి వ్యతిరేకత వస్తోంది. అటు విపక్షాలు ఈ నిర్ణయంపై భగ్గుమంటున్నాయి. పెన్షన్లు తగ్గిస్తే పోరాటం చేస్తామని చెబుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: